Mexico: క్రిస్మస్ పార్టీలో తుపాకీ కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ పార్టీపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో కనీసం 16మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సాల్వాటియెర్రా నగరంలో 'పోసాడా' అనే క్రిస్మస్ పార్టీ జరుగుతోంది. పార్టీ ముగిసిన తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. ఇదే సమయంలో ఆరుగురు సాయుధులు వచ్చి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని స్టేట్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే సాలమన్కాలో దాడికి గల కారణాలు తెలియరాలేదు.
అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గ్వానాజువాటో ఒకటి
మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానాజువాటో ఒకటిని అమెరికా నేర గణాంకాలు చెబుతున్నాయి. గ్వానాజువాటోలో 'జాలిస్కో కార్టెల్', 'సినాలోవా కార్టెల్' వర్గాల మధ్య చాలా కాలంగా ఘర్షణ జరుగుతోంది. ఈ రెండు వర్గాల వివాదంతో గ్వానాజువాటోలో రక్తం ఏరులైపారుతోంది. ఈ కాల్పులు కూడా ముఠా తగాదాల వల్లే జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు డిసెంబర్ 9న సెంట్రల్ మెక్సికోలో ఒక క్రిమినల్ ముఠా, ఒక చిన్న వ్యవసాయ సంఘం నివాసితుల మధ్య హింసాత్మక ఘర్షణ జరగ్గా.. ఆ ఘటనలో 11 మంది మరణించారు. ఇది అమెరికాలో సంచలనంగా మారింది. మెక్సికో సిటీకి నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్స్‌కల్‌టిట్లాన్ కుగ్రామంలో ఈ ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు.