Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి మందుపాతరలను తొలగించడానికి 6 నెలల సమయం..: పెంటగాన్ అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణతో పాటు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య త్వరగా పరిష్కారమవుతుందని భావించినప్పటికీ, పరిస్థితులు అంత సానుకూలంగా లేవని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఈ చమురు సంక్షోభం మరో ఆరు నెలల వరకు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో మళ్లీ తెరవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చని అమెరికా రక్షణ విభాగం నివేదికలో వెల్లడైంది. ఇటీవల అమెరికా రక్షణ విభాగం,ఆ దేశ చట్టసభ సభ్యుల మధ్య గోప్య సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలియజేశాయి.
వివరాలు
ఇరాన్ అమర్చిన సీ మైన్స్ వల్లే ఆలస్యం
ఆ సమావేశంలో అమెరికా రక్షణ గూఢచారి సంస్థ కీలక వివరాలను సభ్యులకు వివరించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే మార్గాన్ని పూర్తిగా సురక్షితంగా మార్చడంలో ఆలస్యం జరుగుతోందని నివేదిక పేర్కొంది. ఈప్రాంతంలో ఇరాన్ ఇరవైకి పైగా పేలుడు పరికరాలు అమర్చిన ఉండవచ్చని అంచనా. వాటిలో కొన్నింటికి జీపీసీ సాంకేతికతను ఉపయోగించడంతో వాటిని గుర్తించడం తలనొప్పిగా మారిందని వెల్లడించింది. ఈపేలుడు పరికరాలను పూర్తిగా తొలగించేందుకు చాల సమయం అవసరమవుతుందని, అంతేకాకుండా ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు పూర్తిగా ముగిసిన తర్వాతే ఈ శుద్ధి చర్యలను సంపూర్ణంగా చేపట్టడం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. అయితే,ఈ నివేదికపై అమెరికా రక్షణ విభాగం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.