Louis Watum Kabamba: కాంగోలో విమాన ప్రమాదం.. మైనింగ్ మంత్రికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికాలోని కాంగో (డీఆర్‌సీ) దేశంలో ఒక మంత్రి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై నుంచి జారిపడి, మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ మంత్రి సహా అందరూ సకాలంలో బయటకు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక దుర్ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో రాగి గనిలో శనివారం వంతెన కూలిపోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
గని ప్రమాద స్థలికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది
ఈ ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు గనుల శాఖ మంత్రి లూయి వాటమ్ కబాంబ రాజధాని కిన్షాసా నుంచి తన బృందంతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. మంత్రి, ఇతర అధికారులతో కలిపి మొత్తం 20 మంది ఉన్న ఆ విమానం కోల్వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే నుంచి బయటికి జారింది. ప్రయాణికులు వెంటనే కిందికి దిగి బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికి విమానానికి మంటలు అంటుకోవడం జరిగింది. కాంగోలో లక్షలాది మంది జీవనాధారం ఈ రాగి గనులే. అయితే, కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండగా, ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.