Loading...
Nvidia Jensen Huang controversy: వివాహేతర సంబంధాల వివాదం.. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో బిగ్ షాక్!
వివాహేతర సంబంధాల వివాదం.. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో బిగ్ షాక్!

Nvidia Jensen Huang controversy: వివాహేతర సంబంధాల వివాదం.. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో బిగ్ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. చైనా గూఢచారిగా అమెరికా అనుమానిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం, మరో ఇద్దరు మహిళలతోనూ సన్నిహిత బంధాలు ఉన్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారాలపై కంపెనీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

వివరాలు

ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారా?

అలిస్ హువాంగ్‌తో తనకున్న సంబంధం విషయంలో జెన్సన్ హువాంగ్ కంపెనీలోని పలువురు కీలక అధికారులను తప్పుదోవ పట్టించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది.

కంపెనీ జనరల్ కౌన్సెల్ టిమ్ టెటర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అలిసన్ వాగన్‌ఫెల్డ్‌తో పాటు మరికొందరు నాయకులకు ఆయన తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు.

రాయిటర్స్ పరిశీలించిన అంతర్గత సందేశాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు కథనం పేర్కొంది. వివాదాల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు కీలకమైన చిప్ సాంకేతికత అభివృద్ధిలో మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన..టెక్నాలజీ పరిశ్రమలో అత్యున్నత స్థానానికి ఎదిగారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకున్నారు.

వివరాలు

భార్యకు క్షమాపణలు చెప్పిన హువాంగ్

తన భార్యకు నమ్మకద్రోహం చేసినందుకు ఆదివారం జెన్సన్ హువాంగ్ ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ ప్రకటనలో అలిస్ హువాంగ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

అలిస్ గతంలో ఎన్విడియా కస్టమర్ సంస్థ మెగాస్పీడ్ ఇంటర్నేషనల్‌లో ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో అమెరికా అధికారులు ఆమెపై విచారణ జరుపుతున్నారు.

జెన్సన్ హువాంగ్, అలిస్ హువాంగ్‌ల ఇంటిపేరు ఒకటే అయినప్పటికీ.. వారిద్దరూ బంధువులు కాదు. ఇదిలా ఉండగా, ఎన్విడియా ఉద్యోగినితోనూ జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఈ వారం ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.

మరో ఎన్విడియా ఉద్యోగినితో కూడా ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు గురువారం రాయిటర్స్ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

అలిస్‌తో సంబంధాలు వ్యాపారపరమైనవేనని వివరణ

మెగాస్పీడ్, అలిస్ హువాంగ్‌తో తనకున్న సంబంధాలపై మీడియా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు జెన్సన్ హువాంగ్ గతంలో రెండుసార్లు స్పందించారు.

తనకు అలిస్‌కు మధ్య ఉన్న పరిచయాలు సాధారణమైనవేనని, వ్యాపార సంబంధాలకే పరిమితమని కంపెనీ నాయకులకు వివరించారు.

అక్టోబర్‌లో పంపిన రెండు వేర్వేరు సందేశాల్లో టిమ్ టెటర్, అలిసన్ వాగన్‌ఫెల్డ్ సహా కంపెనీ ఉన్నతాధికారులకు ఇదే విషయాన్ని తెలియజేశారు.

అలిస్ హువాంగ్‌తో తన పరిచయాలు కస్టమర్లతో సాధారణంగా జరిగే వ్యాపార వ్యవహారాల్లో భాగమేనని పేర్కొన్నారు.

మెగాస్పీడ్‌తో తనకున్న సంబంధాలు కూడా సాధారణ వ్యాపార లావాదేవీలేనని ఇతర సందేశాల్లో స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

గతంలోనూ ఈ వ్యవహారంపై చర్చ

గతేడాది అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం.. అలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్ బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

దీంతో ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఎన్విడియా ఉన్నతాధికారులతో ఆయన చర్చించినట్లు సమాచారం.

ఆ కథనం వెలువడిన తర్వాత 2025లో కంపెనీకి చెందిన కొందరు కీలక అధికారులతో జెన్సన్ హువాంగ్ ఈ విషయంపై మాట్లాడారు.

అయితే అప్పట్లో అలిస్ హువాంగ్‌తో తనకున్న పరిచయాన్ని వివాహేతర సంబంధంగా ఆయన అభివర్ణించలేదు.

వీరిద్దరి మధ్య సంబంధం ఎప్పుడు సన్నిహితంగా మారిందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అయితే, 2023 డిసెంబర్ నుంచే అమెరికా, చైనా సహా పలు ప్రాంతాల్లో వారిద్దరూ కలిసి ఉన్నట్లు చూపించే ఫొటోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి.

వివరాలు

స్వతంత్ర దర్యాప్తునకు ఎన్విడియా బోర్డు నిర్ణయం

ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టేందుకు ఎన్విడియా బోర్డులోని స్వతంత్ర సభ్యులు నవంబర్ 10న కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం వాల్‌స్ట్రీట్‌కు చెందిన న్యాయ సంస్థ వాచ్టెల్, లిప్టన్, రోసెన్ అండ్ కాట్జ్‌ను నియమించారు.

అలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధాలు, ఆమె చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారనే అమెరికా అధికారుల అనుమానాలపై ఈ దర్యాప్తు జరగనుంది.

అలిస్ హువాంగ్ గూఢచారి అన్న ఆరోపణలను చైనా ఖండించింది. మరోవైపు, ఈ వివాదాల మధ్య ఎన్విడియా షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

అక్టోబర్ 6న గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత కంపెనీ షేర్లు 30 శాతానికి పైగా క్షీణించాయి. దీంతో ఎన్విడియా మార్కెట్ విలువలో 1.8 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఆవిరైంది.

ADVERTISEMENT