Bangladesh : హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్
బంగ్లాదేశ్‌లో హింస ముదురుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా నిరసనకారులు వీధుల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో దేశంలోని హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులకు తెగబడుతున్నారు. అదే విధంగా నాలుగు దేవాలయాలను ధ్వంసం చేశారు. మరోవైపు జషోర్ జిల్లాలలోని జబీర్ ఇంటర్నేషన్ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇప్పటికే ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారని అధికార వర్గాలు తెలిపారు. ఈ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.
బంగ్లాదేశ్ తాత్కలిక ప్రభుత్వ సారథిగా మహ్మద్ యూనస్
ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కారణంగా 440కి పైగా మృతి చెందారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్‌ను మంగళవారం రాత్రి ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుండి విడుదలైన తర్వాత, విద్యార్థుల తిరుగుబాటు మధ్య దేశవ్యాప్తంగా హింస, విధ్వంసం జరుగుతోందని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
బంగ్లాదేశ్ జనాభాలో 8శాతం మంది హిందువులు
బంగ్లాదేశ్‌లోని 170 మిలియన్ల జనాభాలో 8 శాతం మంది హిందువులున్నారు. లౌకికవాదానికి మద్దతు పలికే హసీనా అవామీ లీగ్ పార్టీకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. షేక్ హసీనా రాబోయే రెండు రోజులు భారతదేశం నుండి బయటకు వెళ్లే అవకాశం లేదని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత సి-130జె సైనిక విమానంలో సోమవారం హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనాను కట్టుదిట్టమైన భద్రతతో సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇక హతిబంధ ఉపజిల్లాలోని పుర్బో సర్దుబీ గ్రామంలో గత రాత్రి 12 హిందువుల ఇళ్లను ఆందోళన కారులు తగలబెట్టారు.