Iran: విషమంగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగం.. ఇరాన్ వారసత్వంపై ఆసక్తిరమైన చర్చ
ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్‌పై యుద్ధ విమానాలతో జరిపిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఖమేనీ ఆరోగ్యం విషమించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పలు కీలక వివరాలు వెల్లడించింది. 1989లో రుహోల్లా ఖొమేనీ మృతి తర్వాత ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు 85 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఖమేనీ తర్వాత ఎవరు బాధ్యతలు చేపడతారు అనే ప్రశ్న తలెత్తింది.
ఖమేనీ తరువాతి వారసుడు ఎవరు?
తాజా సమాచారం ప్రకారం, ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా (55) సుప్రీం లీడర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఎలా స్పందించాలన్న చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఈ ప్రచారం వెల్లివిరుస్తోంది. ఈ విషయంపై ఇరాన్ అధికారిక ప్రకటన రానుండగా, ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.