
Cyber crime: ఆస్ట్రేలియన్ సూపర్‌పై సైబర్ దాడి.. రూ. 2.6 కోట్లు కాజేశారు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పింఛను నిధి ఆస్ట్రేలియన్ సూపర్ (AustralianSuper)పై హ్యాకర్లు దాడి చేసినట్లు గుర్తించారు.
స్కామర్లు ఈ నిధికి సంబంధించిన అధికారిక హ్యాండిల్‌ను హ్యాక్ చేసి 600 మంది సభ్యుల పాస్‌వర్డ్‌లు దొంగిలించారని అధికారులు ధృవీకరించారు.
అంతేకాకుండా నలుగురు సభ్యుల ఖాతాల్లోని 5,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.2.6 కోట్లు) కాజేశారని వెల్లడించారు.
Details
మొత్తం రూ. 19 లక్షల కోట్ల నిధి
ఆస్ట్రేలియన్ సూపర్‌లో 35 లక్షల మంది సభ్యులు ఉన్నారు మొత్తం 365 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 19 లక్షల కోట్లు) నిధులు ఈ పింఛను ఫండ్‌లో ఉన్నాయి.
ఈ భారీ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని హ్యాకర్లు మోసానికి పాల్పడ్డారు.
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మిచెల్ మెక్‌గిన్నెస్ మాట్లాడుతూ ఈ సైబర్ దాడి గురించి తమకు సమాచారం అందిందని, అయినా ఎంతమంది ఖాతాదారులు ప్రభావితమైనారనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు.
ఎటువంటి అనుమానాస్పద లావాదేవీలు జరగలేదని, దొంగిలించిన ఖాతాలను తక్షణమే లాక్ చేసి బాధితులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.
Details
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రతిస్పందన
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పందించారు.
హ్యాక్ ఘటనల గురించి ప్రభుత్వానికి సమాచారం ఉందని, తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే కదిలాయని తెలిపారు.
సైబర్ నేరాలు దేశంలో తీవ్రమవుతున్నాయని, ప్రతి ఆరు నిమిషాలకు ఒక సైబర్ నేరం జరుగుతోందని అన్నారు.
Details
సైబర్ భద్రత కోసం భారీ నిధుల కేటాయింపు
సైబర్ నేరాలను అరికట్టేందుకు 2023లో ఆస్ట్రేలియా ప్రభుత్వం 587 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను (రూ. 3,100 కోట్లు) కేటాయించింది. ప్రభుత్వ ఏజెన్సీలు, పౌరుల భద్రతను పర్యవేక్షిస్తూ సైబర్ మోసాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.
ఖాతాదారులకు హెచ్చరిక
అధికారులు ఆస్ట్రేలియన్ సూపర్ సభ్యులకు తమ ఆన్‌లైన్ ఖాతాలను చెక్ చేసుకోవాలని సూచించారు. అలాగే, పాస్‌వర్డ్ మార్చుకోవాలని, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే అధికారులను సమాచారం ఇవ్వాలని కోరారు.