Cyclone Ditwah: శ్రీలంకలో దిత్వా తుఫాన్ ఎఫెక్టు.. భారీ వర్షాల కారణంగా 123 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దిత్వా తుపాను (Cyclone Ditwah) ప్రభావంతో శ్రీలంక (Sri Lanka) తీవ్రంగా అతలాకుతలమవుతోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు, కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు సృష్టించాయి. ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారని, మరెందరి గల్లంతు ఇంకా గుర్తించాల్సి ఉందని శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) శనివారం ప్రకటించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు డీఎంసీ పేర్కొంది. ఇప్పటికే 43 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీఎంసీ జనరల్ డైరెక్టర్ సంపత్ తెలిపారు.
Details
సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ టీం
రెస్క్యూ టీంలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని చెప్పారు. శుక్రవారం కెలాని నది ఉప్పొంగి పక్క గ్రామాలు మునిగిపోగా, వందలాది మందిని అత్యవసర పునరావాసాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ మిగిలి ఉన్న ఇతరులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు జరుగుతున్నాయి.
Details
ఆపరేషన్ సాగర్ బంధుతో భారత్ అండగా
దిత్వా తుపాను ధాటికి శ్రీలంక దెబ్బతిన్న నేపథ్యంలో, భారత్ వెంటనే సహాయక చర్యలకు ముందుకొచ్చింది. భారత వైమానిక దళం (IAF) 'ఆపరేషన్ సాగర్ బంధు' (Operation Sagar Bandhu) పేరుతో శ్రీలంకకు అత్యవసర సహాయం అందిస్తోంది. IAF వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి హిండన్ ఎయిర్‌బేస్ నుంచి రెండు విమానాలు అత్యవసర సరుకులతో బయలుదేరాయి. వీటిలో 21 టన్నుల నిత్యావసర సామగ్రి, శానిటరీ వస్తువులు, అత్యవసర పరికరాలున్నాయి. శనివారం తెల్లవారుజామున ఈ విమానాలు కొలంబోలోని బండరునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు, శ్రీలంక వైమానిక దళం ప్రతినిధులకు ఈ సరుకులను అధికారికంగా అప్పగించారు.