LOADING...
China Mine Disaster: చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!
చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!

China Mine Disaster: చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు మృతి చెందినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇంకా పలువురు కార్మికులు భూగర్భంలో చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో గనిలో మొత్తం 247 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం రాత్రంతా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో శనివారం తెల్లవారుజాము నాటికి 201 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

వివరాలు

కొంతమంది గల్లంతు

అయితే మరికొంత మంది ఇంకా గనిలోనే చిక్కుకుని ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ లేదా భూగర్భ ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన కార్మికులను రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిన్హువా నివేదించింది.

వివరాలు

1.3 బిలియన్ టన్నుల బొగ్గు తవ్వినట్లు సమాచారం

షాన్సీ ప్రావిన్స్ చైనాలో ప్రధాన బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఈ ప్రాంతంలోనే 1.3 బిలియన్ టన్నుల బొగ్గు తవ్వినట్లు సమాచారం. ఇది దేశ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు మూడవ వంతుగా చెబుతున్నారు. అయితే భద్రతా లోపాలు, ప్రమాదకరమైన పనివాతావరణం కారణంగా చైనాలో గని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. తాజా ఘటన మరోసారి గని కార్మికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది.

Advertisement