LOADING...
Khawaja Asif: చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!
చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!

Khawaja Asif: చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపిన ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య వందకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. PoKపై పాక్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధ విధానాలు, హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

వివరాలు

నిరసనకారుల హెచ్చరిక

ఆయన పాకిస్తాన్ రాజ్యాంగాన్ని, అలాగే ఖురాన్‌లో అత్యంత కఠిన శిక్షలను సూచించే వచనాలను ప్రస్తావిస్తూ నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. "దేశం పట్ల విధేయతతోనే చర్చలు ప్రారంభమవుతాయి" అంటూ ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆజాద్ కాశ్మీర్‌లోని కొంతమంది వ్యక్తులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం దేశానికి విధేయత చూపాలని సూచించారు. అదేవిధంగా ఖురాన్‌లోని సురా అల్ మాయిదాలోని 33వ వచనాన్ని ఉటంకిస్తూ, "అల్లా, ప్రవక్తపై యుద్ధం చేసి అవినీతి వ్యాప్తి చేసే వారికి శిక్షగా చంపడం, శిలువ వేయడం, చేతులు-కాళ్లు నరికివేయడం లేదా దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.

వివరాలు

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు

ఈ వ్యాఖ్యలను పీఓకే నిరసనకారులను హెచ్చరించే విధంగా ఉపయోగించినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లోని మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ ఉద్యమాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు. రాజకీయ వ్యతిరేకతను మతపరమైన నేరాలతో కలిపి చూడటం వల్ల అసమ్మతివాదులను రాజ్యం, మతానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

Advertisement