China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు
చైనా ఇటీవల తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూతపడ్డాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో 14,808 కిండర్ గార్టెన్లు మూతపడగా, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 11శాతం తగ్గడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా, 5,645 ప్రాథమిక పాఠశాలలు కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో మూసివేసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023లో చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి 140 కోట్లకు చేరుకుంది.
చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా
జననాల సంఖ్య కూడా 1949 తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గిపోవడంతో, జనాభా పెరుగుదల రేటు మరింత క్షీణించినట్లు అంచనా వేస్తున్నారు. చైనా రెండుముఖాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు జననాల రేటు తగ్గుతుండగా, మరోవైపు వృద్ధుల జనాభా అధికమవుతోంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారు 30 కోట్లకు చేరగా, ఈ సంఖ్య 2035 నాటికి 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో, మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మార్చి, పాఠశాల సిబ్బందిని వృద్ధుల సంరక్షకులుగా నియమిస్తున్నారు. ఈ మార్పులు చైనా సామాజిక వ్యూహంలో కొత్త ఒరవడిని సూచిస్తున్నాయి.