Page Loader
China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం
తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం

China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తైవాన్‌కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని హెచ్చరించింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలు వెంటనే ఆపాలని బీజింగ్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. తైవాన్ రక్షణ వ్యవస్థను బలపర్చేందుకు, మిలటరీ శిక్షణ, యుద్ధ సామగ్రి కొనుగోళ్ల కోసం అమెరికా 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని అందించనుంది. అదనంగా 265 మిలియన్ డాలర్ల విలువైన మిలటరీ ఆయుధాల విక్రయానికి కూడా అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. చైనా గత కొన్నేళ్లుగా తైవాన్ చుట్టూ తన సైనిక శక్తిని పెంచుతూ, జలసంధిలో మోహరింపులు పెంచింది.

Details

భారీగా సైనిక కవాతులు ప్రారంభించిన చైనా

తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె ఇటీవల అమెరికాలోని హవాయి, గువామ్‌ ప్రాంతాలను సందర్శించడంపై బీజింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా భారీ సైనిక కవాతులు ప్రారంభించింది. తైవాన్‌కు భారీ రక్షణ సాయం చేయడం చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు తెలుస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా చర్యలు చైనా ఆగ్రహానికి గురవుతుండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తైవాన్‌ సమీపంలో చైనా మిలటరీ చొరబాట్లు, అమెరికా నుంచి వస్తున్న సాయానికి సంబంధించి ప్రస్తుత పరిణామాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణం కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు.