LOADING...
Khawaja Asif: ప్రజా ప్రభుత్వం కాదు.. ఆర్మీ జోక్యం ఉందని ఒప్పుకున్న రక్షణమంత్రి
ప్రజా ప్రభుత్వం కాదు.. ఆర్మీ జోక్యం ఉందని ఒప్పుకున్న రక్షణమంత్రి

Khawaja Asif: ప్రజా ప్రభుత్వం కాదు.. ఆర్మీ జోక్యం ఉందని ఒప్పుకున్న రక్షణమంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ప్రజాస్వామ్య పాలన ఉన్నట్లు బయటకు కనిపించినా.. వాస్తవానికి అన్ని వ్యవహారాలు ఆర్మీ ఆధీనంలోనే సాగుతాయని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Defence Minister Khawaja Asif) బహిరంగంగానే అంగీకరించారు. పాక్‌లో హైబ్రిడ్‌ మోడల్‌ పాలన కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. పౌర ప్రభుత్వం, సైన్యం కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ విషయమై ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 'పాకిస్థాన్‌లో మీకు వింత మోడల్‌ ఉంది. దీనినే మీరు హైబ్రిడ్ మోడల్‌ అంటారు.

Details

పాక్ లో పరిస్థితి భిన్నంగా ఉంది

చాలా దేశాల్లో రక్షణ మంత్రికి కీలక సమాచారం ఆర్మీ చీఫ్‌ అందజేస్తారు. కానీ మీ దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ (Asim Munir) మీకంటే శక్తివంతుడే కదా?'' అని జర్నలిస్టు ప్రశ్నించగా.. ఆసిఫ్‌ వెంటనే తోసిపుచ్చారు. 'అలా కాదు. నేను ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రతినిధిని'' అని సమాధానం ఇచ్చారు. అదే అమెరికాలో (USA) రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ (Pete Hegseth)కు సైనికాధికారులను తొలగించే అధికారముంటుందన్నారు. కానీ పాక్‌లో అది సాధ్యం కాదని చెప్పడంతో.. 'ప్రతి దేశం పాలనా విధానం వేరంటూ హైబ్రిడ్ మోడల్‌ను సమర్థించుకున్నారు.

Details

ప్రజలను కాపాడటమే లక్ష్యం

ఇక అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ (Shehbaz Sharif) కన్నా ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో (Donald Trump) అనేకసార్లు సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన విందుకు హాజరైన విషయమూ తెలిసిందే. అయితే మునీర్‌ మాత్రం పదవీ రాజకీయాలకు దూరమని ప్రకటించుకున్నారు. 'భగవంతుడు దేశసేవ కోసం నన్ను పుట్టించాడు. ప్రజలను కాపాడటం తప్ప మరో లక్ష్యం నాకు లేదంటూ చెప్పుకుంటారు. కానీ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీని (Asif Ali Zardari) బలవంతంగా గద్దె దించి ఆ పదవిని ఆక్రమించబోతున్నారని వదంతులు విస్తరిస్తున్నాయి.