LOADING...
Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. వెంటనే అప్రమత్తమైన పైలట్
ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. వెంటనే అప్రమత్తమైన పైలట్

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. వెంటనే అప్రమత్తమైన పైలట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుల విమానం, యుద్ధ విమానం ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పించుకుంది. గత వారం ఈ ఘటన జరిగినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. పారిస్ నుంచి సిన్సినాటి / నార్తర్న్ కెంటకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం, అమెరికాకు చెందిన బీ-52 బాంబర్ యుద్ధ విమానం ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి వచ్చాయి. అయితే వెంటనే అప్రమత్తమైన డెల్టా విమానం పైలట్, విమానాన్ని కొన్ని అడుగులు దిగువకు దించి పెను ప్రమాదాన్ని నివారించాడు. యుద్ధ విమానం సమీపంలోకి వచ్చిన విషయాన్ని 'ఎవరూ మాకు చెప్పలేదు' అని పైలట్ చెప్పడం గమనార్హం.

వివరాలు 

30,000 అడుగుల ఎత్తులో డెల్టా విమానం

ఇది రాడార్ నియంత్రణ వ్యవస్థలో కమ్యూనికేషన్ లోపం వల్లనే జరిగిందని భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన బీ-52 హెచ్ స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్, డెల్టా విమానానికి అత్యంత దగ్గరకు వచ్చి ప్రమాదాన్ని కలిగించే స్థితి ఏర్పడింది. ఆ సమయంలో డెల్టా విమానం 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. సమీపంలో బీ-52 ఉన్నట్టు గుర్తించిన డెల్టా పైలట్ వెంటనే అప్రమత్తమై మాన్యువల్‌గా విమానాన్ని నిందించగా పెను ప్రమాదం తప్పింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, రెండు విమానాల మధ్య దూరం 1.7 నాటికల్ మైళ్ల కన్నా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇది రాడార్ నియంత్రణ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన దూరం కన్నా చాలా తక్కువ.

వివరాలు 

మాకు ఎవ్వరూ ఏ సమాచారం ఇవ్వలేదు

డెల్టా పైలట్,ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) ద్వారా వచ్చిన హెచ్చరికను గమనించి, విమానాన్ని 500 అడుగులు దిగువకు తీసుకెళ్లి ప్రమాదాన్ని నివారించాడు. "మాకు ఎవ్వరూ ఏ సమాచారం ఇవ్వలేదు. మేము రాడార్ పర్యవేక్షణ కింద ఉన్నామనుకున్నాం" అని డెల్టా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిపిన సంభాషణలో చెప్పాడు. ఏవియేషన్ ఔత్సాహికులు షేర్ చేసిన వీడియోలో ఈ ఆడియో రికార్డ్ అయింది.

వివరాలు 

 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో 

ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ఎఫ్ఏఏతో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్, తమ పైలట్ అన్ని ప్రమాణ ప్రక్రియలు పాటించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని ప్రకటించింది. ప్రయాణికులెవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని, వారు అందరూ సురక్షితంగా ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది.