Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి ఈ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్‌దానీ కైవసం చేసుకున్నారు. భారతీయ-ఉగాండా మూలాలు కలిగిన మమ్‌దానీని ఓడించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇది ఈ ఎన్నికలు ట్రంప్‌కు ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారాయో సూచిస్తుంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో "కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ గెలిస్తే,న్యూయార్క్‌కు కనీస అవసరాలకు మాత్రమే నిధులు కేటాయిస్తాను" అని పేర్కొన్నారు. అయితే ఫలితాలు ట్రంప్ అంచనాలను తలకిందులు చేశాయి. 34ఏళ్ల వయస్సులోనే మమ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై కొత్తరికార్డు సృష్టించారు.
వివరాలు
సినీ డైరెక్టర్ మీరానాయర్ కుమారుడే
న్యూయార్క్ మేయర్‌గా గెలిచిన జొహ్రాన్ మమ్‌దానీ, ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు కావడం విశేషం. ఉగాండా జాతీయుడైన మహ్మూద్ మమ్‌దానీ, మీరా నాయర్ దంపతుల సంతానమే జొహ్రాన్. సామాజిక సమానత్వం, సోషలిస్ట్ ఆలోచనలు కలిగిన ఆయన, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించడం విశేషంగా నిలిచింది.
వివరాలు
న్యూయార్క్‌లోనూ ఉచిత బస్సు ఎఫెక్ట్
మమ్‌దానీ విజయంలో అతని ప్రధాన హామీగా నిలిచింది. నగరంలో ఉచిత సిటీ బస్సు సేవలు. అదనంగా ఆయన అద్దెలను స్థిరీకరించడం, యూనివర్శల్ చైల్డ్ స్కీమ్ అమలు, 2030 నాటికి కనీస వేతనాల పెంపు వంటి అంశాలను ప్రజల ముందుంచారు. కార్పొరేట్లు మరియు సంపన్నులపై పన్నులు పెంచి సాధారణ ప్రజల జీవన వ్యయాలను తగ్గిస్తానని ప్రకటించారు. ఈ హామీలు నగర వాసులను ఆకట్టుకున్నాయి. ఇవన్నింటికి మించి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన మమ్‌దానీ వైఖరి ఆయనకు విశేష ప్రజాదరణను తీసుకువచ్చింది.