Indian Americans: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఓ జాతీయస్థాయి సర్వే వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ కంటే.. డెమోక్రటిక్ అభ్యర్థులకే ఓటు వేయాలని ఎక్కువ మంది ఇండియన్ అమెరికన్లు భావిస్తున్నట్లు ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ (APIAVote) నిర్వహించిన సర్వేలో తేలింది. 435 కాంగ్రెస్ స్థానాలు,35 సెనెట్ సీట్లతో పాటు పలు స్థానిక సంస్థలకు నవంబర్ 3న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇంకా ప్రచారాన్ని పూర్తిస్థాయిలో ముమ్మరం చేయకముందే ఈ సర్వే వివరాలు వెలువడ్డాయి.
వివరాలు
66 శాతం మంది డెమోక్రటిక్ వైపు
దేశవ్యాప్తంగా నమోదైన ఏషియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ (AAPI) ఓటర్లలో 90 శాతానికి పైగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.
ఇండియన్ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కాంగ్రెస్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేయాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
దీనికి భిన్నంగా 18 శాతం మంది మాత్రమే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు.
సెనెట్ ఎన్నికల విషయానికొస్తే.. 22 శాతం మంది ఇండియన్ అమెరికన్లు రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు సర్వే తెలిపింది.
వివరాలు
ఆసియా అమెరికన్ ఓటర్లలో పెరుగుదల
అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఏఏపీఐ డేటా వ్యవస్థాపకుడు కార్తిక్ రామకృష్ణన్ తెలిపారు.
ఎన్నికల్లో ఈ వర్గం ఓటర్ల ప్రాధాన్యం కూడా క్రమంగా పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
2,066 మంది నమోదిత ఓటర్లతో సర్వే
ఈ జాతీయస్థాయి సర్వేలో మొత్తం 2,066 మంది నమోదిత ఓటర్లు పాల్గొన్నారు.
వీరిలో 1,896 మంది ఆసియా అమెరికన్లు కాగా.. 242 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారు.
మరో 170 మంది పసిఫిక్ ఐలాండర్లు సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
2026లో అమెరికాలో సుమారు కోటి 60 లక్షల మంది ఆసియా అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ (AAPI) ప్రజలు ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉంటారని ఏఏపీఐ డేటా వెల్లడించింది.
దీంతో రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ఈ వర్గాల ఓటర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి.