Democrats: అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 సీట్లు.. 1992 తర్వాత భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రాజకీయాల్లో డెమోక్రటిక్ పార్టీ సత్తా చాటింది. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఎన్నికల్లో ఏకంగా 258 స్థానాలను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. 1992 తర్వాత ఆ పార్టీ సాధించిన అతిపెద్ద విజయంగా ఇది నిలిచింది. నార్త్ కరోలినాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి చక్ హబ్బర్డ్.. రిపబ్లికన్ అభ్యర్థి వర్జీనియా ఫాక్స్‌పై విజయం సాధించడంతో మొత్తం సీట్ల సంఖ్య 258కి చేరింది. అమెరికా ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో డెమోక్రాట్లు అదనంగా 44 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ 173 స్థానాలకే పరిమితం కానుంది. ఇంకా నాలుగు స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది.
వివరాలు
అమెరికాలో విభజిత ప్రభుత్వం.. 100 రోజుల కార్యాచరణకు డెమోక్రాట్ల సిద్ధం
1992లో బిల్ క్లింటన్ హయాంలో డెమోక్రాట్లు 258 సీట్లు సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే సంఖ్యను అందుకున్నారు.
2008లో బరాక్ ఒబామా నాయకత్వంలో ఆ పార్టీ గెలుచుకున్న 257 స్థానాల కంటే తాజా విజయం ఒక సీటు ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఎన్నికల ఫలితాలతో అమెరికాలో విభజిత ప్రభుత్వం ఏర్పడింది.
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగుతున్నప్పటికీ, ప్రతినిధుల సభతో పాటు సెనెట్ కూడా డెమోక్రాట్ల చేతుల్లోకి వెళ్లాయి.
దీంతో తమ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు డెమోక్రాట్లు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా రిపబ్లికన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను సమీక్షించడంతో పాటు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న జీవన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టనున్నారు.
వివరాలు
ట్రంప్ కుటుంబ ఆస్తులపై విచారణకు డెమోక్రాట్ల సిద్ధం
ఈ క్రమంలో మెడికెయిడ్ పథకంలో చేసిన కోతలను వెనక్కి తీసుకోవడం,అఫర్డబుల్ కేర్ యాక్ట్‌కు సంబంధించిన పన్ను రాయితీలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై త్వరలోనే ఓటింగ్ నిర్వహించనున్నారు.
ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ నిర్ణయాలను తమ ప్రాధాన్య అంశాలుగా డెమోక్రాట్లు భావిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వ పనితీరుపైనా డెమోక్రాట్లు దృష్టి సారించనున్నారు.
అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల పెరుగుదలపై విచారణ చేపట్టేందుకు ప్రతినిధుల సభకు ఉన్న సబ్‌పోనా అధికారాలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు.
ఈ అధికారాల ద్వారా అవసరమైన పత్రాలు, వివరాలను సమర్పించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించే అవకాశం ఉంటుంది.
వివరాలు
ట్రంప్‌పై అభిశంసనకు సంకేతాలు..
ప్రతినిధుల సభ తదుపరి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న హకీమ్ జెఫ్రీస్, ఈ పదవిని చేపట్టే తొలి నల్లజాతి వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు.
ట్రంప్‌పై మూడోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు.
మరోవైపు ఈ ఎన్నికల్లో సాధించిన విజయంపై డెమోక్రాట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ స్పందిస్తూ.. ఇది మార్పు కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించారు.