మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టిన చైనా.. సరిహద్దులోకి చొరబడి గ్రామాలు, ఔట్ పోస్టులు నిర్మాణం
పోరుగు దేశాల భూభాగాలకు కబ్జా చేయడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. వివిదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలని చైనా కుట్రపడుతోంది. ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్ అధికారికంగా చర్చలు జరుపుతుండగా, మరోవైపు భూటాన్ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది. తాజాగా భూటాన్‌లోని జకర్‌లుంగ్ వ్యాలీలో అనుమతి లేని నిర్మాణ కార్యకలాపాలను చైనా చేపడుతున్నట్లు ఉపగ్రహా ఫోటోలు బయటపడ్డాయి. ఈ మేరకు మాక్సర్ అనే సంస్థ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. గత రెండేళ్లుగా ఆ ప్రాంతంలో చైనా తన ఉనికి పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
అక్రమ కట్టడాలను అధిక సంఖ్యలో నిర్మిస్తున్న చైనా
అరుణాచల్ ప్రదేశ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో భూటాన్ తూర్పు సరిహద్దు వెంబడి చిన్న చిన్న గ్రామాలను చైనా నిర్మిస్తున్నట్లు ఆ ఫోటోలలో కన్పిస్తోంది. ఆ ప్రాంతంలో నివాస భవనాలు, సైనిక్ బ్యారెక్‌లు, ఔట్ పోస్టులను చైనా నిర్మిస్తున్నట్లు మాక్సర్ సంస్థ స్పష్టం చేసింది. మొదటి ఎన్‌క్లేవ్‌లో దాదాపు 129 భవనాలు నిర్మాణాలు కనిపించగా, కొద్ది దూరంలో ఉన్న రెండో ఎన్‌క్లేవ్‌లో 62 భవనాలు కనిపించాయని తెలిపింది. ఇక 2017లో భారత్-చైనా దళాల మధ్య రెండున్నర నెలల పాటు డోక్లామ్ వద్ద ప్రతిష్టంభన కొనసాగింది. ప్రస్తుతం భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా కొనసాగిస్తూ అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు సమచారం.