Dhaka: ఢాకాలో హిందువుల భారీ నిరసనలు.. రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో రాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలతో చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రాజధాని ఢాకాలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వేలాది మంది హిందువులు 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాలు
షాబాగ్‌లో భారీ ర్యాలీ.. జాతీయ ప్రెస్ క్లబ్ వరకు ప్రదర్శన
హిందూ మహాజోట్ పిలుపుతో విద్యార్థి సంఘాలు, హిందూ సంస్థలు కలిసి ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో భారీ ఆందోళన చేపట్టాయి. అక్కడి నుంచి జాతీయ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి శాంతియుతంగా తమ నిరసన తెలిపారు. రాముడి చిత్రాన్ని అవమానించిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గైబంధా ఘటనపై ఆగ్రహం.. 72 గంటల గడువు ఈ నెల ప్రారంభంలో గైబంధా జిల్లాలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కొందరు మత ఛాందసవాదులు రాముడి చిత్రంపై చెప్పు ఉంచినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అవి పేర్కొంటున్నాయి.
వివరాలు
81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణం.. ప్రపంచ రికార్డుపై ఆశలు
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి. ఉత్తర బంగ్లాదేశ్‌లోని పలాష్‌బారిలో 81 అడుగుల ఎత్తుతో రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా నిలిచే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయ సముదాయంలో 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
వివరాలు
బెదిరింపుల ఆరోపణలు.. తాత్కాలికంగా నిలిచిన పనులు
రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఇస్లామిక్ సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆలయ కమిటీ ఆరోపిస్తోంది. ఓ మత బోధకుడు బుల్డోజర్‌తో విగ్రహాన్ని కూల్చివేస్తానని హెచ్చరించినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని విగ్రహ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. వివాదాలు మరింత ముదరకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
64 జిల్లాల్లో రామాలయాల నిర్మాణ హెచ్చరిక
విగ్రహ నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించకపోతే బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాల్లో ఒక్కో రామాలయాన్ని నిర్మిస్తామని హిందూ మహాజోట్ ప్రకటించింది. అలాగే శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజా ఉత్సవాల జాతీయ కమిటీ వెల్లడించింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనారిటీల భద్రతపై మళ్లీ చర్చ బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు సుమారు 8 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 133 సామాజిక, మత ఘర్షణలకు సంబంధించిన ఘటనలు నమోదైనట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలతో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, మత సామరస్యం వంటి అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.