LOADING...
Uganda: ఉగాండాలో డీఎన్‌ఏ టెస్టుల కలకలం.. పితృత్వ పరీక్షలతో కూలిపోతున్న కుటుంబ బంధాలు
ఉగాండాలో డీఎన్‌ఏ టెస్టుల కలకలం.. పితృత్వ పరీక్షలతో కూలిపోతున్న కుటుంబ బంధాలు

Uganda: ఉగాండాలో డీఎన్‌ఏ టెస్టుల కలకలం.. పితృత్వ పరీక్షలతో కూలిపోతున్న కుటుంబ బంధాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాము పెంచుకుంటున్న పిల్లలే నిజంగా తమ సంతానమా అన్న అనుమానాలు పెద్దఎత్తున పెరుగుతుండటంతో, దేశవ్యాప్తంగా పురుషులు భారీగా డీఎన్‌ఏ పితృత్వ పరీక్షలు చేస్తున్నారు. కానీ ఈ పరీక్షల ఫలితాలు అనేక కుటుంబాల్లో అనూహ్య కల్లోలానికి దారితీస్తూ, సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, ప్రభుత్వం స్వయంగా అలాంటి పరీక్షలు చేయించుకోవద్దని హెచ్చరికలను జారీ చేసింది. ఇటీవల కంపాలాలోని ఓ ధనిక విద్యావేత్త కేసు దేశాన్ని కుదిపేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షలో ఆయన ముగ్గురు పిల్లల్లో ఒకరు తన సంతానం కాదని తేలింది.

Details

అనేక కుటుంబాల్లో గొడవలు

ఈ సంఘటనను స్థానిక మీడియా విస్తృతంగా ప్రసారం చేయడంతో మరెంతోమంది పురుషుల్లో తమ పిల్లలపై అనుమానాలు ముమ్మరమయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా డీఎన్‌ఏ పరీక్షా కేంద్రాలు వేగంగా పెరిగిపోయాయి. రేడియో స్టేషన్లలోనూ, ప్రజా రవాణా వాహనాలపై కూడా ఈ పరీక్షల ప్రకటనలు వరసగా వినిపిస్తున్నాయి. ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయీ వెల్లడించిన వివరాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. స్వచ్ఛందంగా పితృత్వ పరీక్షలను చేయించుకునేవారిలో 95 శాతం పురుషులేనని, వీరిలో 98 శాతం మందికి పైగా ఫలితాలు తమ పిల్లలు బయాలజికల్‌గా తమవారు కాదని చూపుతున్నాయన్నారు. ఈ తీవ్రమైన నిర్ధారణలు అనేక కుటుంబాల్లో గొడవలకు దారితీస్తూ, ఏళ్ల తరబడి నిర్మితమైన బంధాలను ఒక్కరోజులోనే విచ్ఛిన్నం చేస్తున్నాయి.

Details

ఇంట్లో పెరిగిన బిడ్డ మన బిడ్డే

ఈ పరిస్థితి నియంత్రణలోకి రావడానికి మత గురువులు, తెగల నాయకులు ముందుకు వస్తున్నారు. పిల్లలు ఎలా పుట్టినా, ఇంట్లో పెరిగిన బిడ్డ మన బిడ్డే. వారిని తిరస్కరించడం పాపమని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉగాండా ఆంగ్లికన్ ఆర్చ్‌బిషప్ స్టీఫెన్ కజియింబా తన క్రిస్మస్ ప్రసంగంలో ఏసుక్రీస్తు జననాన్ని ఉదాహరణగా ప్రస్తావించి, కన్యామేరియ ద్వారా పుట్టిన ఏసును జోసెఫ్ తన కుమారుడిగా స్వీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా విశ్వాసంతో కుటుంబాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఇక తెగ నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి పలువురు కూడా కుటుంబాల్లోని విభేదాలను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Details

సమాజంపై తీవ్రమైన ఒత్తిడి

తన వద్దకు వచ్చే అనుమానిత తండ్రులకు, "నేను మా నాన్న పోలికలతో లేను, అయినా ఆయన నన్ను తన వారసుడిగా అంగీకరించారు" అని చెప్పి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆస్తి పంపకాల తగాదాలు, విడాకుల ప్రక్రియలు వంటి సందర్భాల్లో డీఎన్‌ఏ పరీక్షలు కీలకతరం అవుతున్నాయి. ఒకప్పుడు మతపెద్దల సామాజిక సలహాలు, సంప్రదాయాలు కుటుంబాలను కాపాడేవి. కానీ ఆధునిక సాంకేతికత వెల్లడిస్తున్న చేదు నిజాలు ఉగాండాలో కుటుంబ నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేస్తూ, సమాజంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.