LOADING...
Trump: అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల డీల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం
అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల డీల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం

Trump: అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల డీల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో టిక్‌ టాక్ భవిష్యత్తుపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి తొలగిపోయింది. ఈ యాప్ కార్యకలాపాలను దేశంలో కొనసాగించేందుకు కుదిరిన కీలక ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన గురువారం సంతకం చేశారు. ఈ ఒప్పందం కోసం తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇటీవల ఫోన్‌ ద్వారా చర్చించానని, ఆయన కూడా ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారని ట్రంప్ వెల్లడించారు.

వివరాలు 

అమెరికన్ కంపెనీలకు ప్రధాన వాటాలు

కొత్తగా కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికా కేంద్రంగా ఏర్పాటు చేయబడే ఒక జాయింట్ వెంచర్ పర్యవేక్షించనుంది. ఈ కొత్త సంస్థలో ఒరాకిల్, సిల్వర్ లేక్‌తో పాటు మరికొన్ని అమెరికన్ కంపెనీలకు ప్రధాన వాటాలు లభించనున్నాయి. మరోవైపు టిక్‌టాక్ మాతృసంస్థ అయిన చైనా కంపెనీ బైట్‌డాన్స్ వాటాను 20 శాతం కంటే తక్కువగా పరిమితం చేశారు. ఈ అమెరికన్ జాయింట్ వెంచర్ మొత్తం విలువ సుమారు 14 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

వివరాలు 

డేటా పూర్తిగా సురక్షితం

ఈ డీల్‌పై స్పందించిన జేడీ వాన్స్ మాట్లాడుతూ, అమెరికా ప్రజల డేటా భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "టిక్‌టాక్‌ను కొనసాగించేలా చూసుకోవడమే కాకుండా, అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టబద్ధంగా రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ఒప్పందంతో ఇకపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన లేకుండా టిక్‌టాక్‌ను ఉపయోగించవచ్చు. వారి డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అమెరికా పౌరులకు వ్యతిరేకంగా ఇది ఎప్పటికీ ప్రచార సాధనంగా మారే అవకాశం ఉండదు" అని ఆయన వివరించారు.

వివరాలు 

టిక్‌టాక్ వినియోగదారులకు భారీ ఊరట

అలాగే, టిక్‌టాక్‌లోని అల్గారిథమ్‌పై నియంత్రణ కూడా పూర్తిగా అమెరికన్ పెట్టుబడిదారుల వద్దే ఉంటుందని వాన్స్ నొక్కి చెప్పారు. "మరే ఇతర దేశ ప్రభుత్వ అవసరాల కోసం కాకుండా, కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకునేలా ఈ డీల్ రూపకల్పన చేయబడింది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో కోట్లాది మంది టిక్‌టాక్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.