LOADING...
H-1B visa applications: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుము 
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుము

H-1B visa applications: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుము 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనే భారతీయులకు పెద్ద షాక్‌ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ (H1-B) వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయ ప్రకారం, హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల కోసం వార్షిక రుసుమును \$100,000 (లక్ష డాలర్లు)గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునే ప్రతి వీసా కోసం ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు భారత్‌తోపాటు, చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటన ప్రకారం, ప్రతి హెచ్‌-1బీ వీసా కోసం వార్షిక లక్ష డాలర్లు రుసుము విధించినట్లు తెలిపారు. వీటిని అన్ని పెద్ద కంపెనీలకు ఇప్పటికే వివరించామని చెప్పారు.

Details

ఇంతవరకు స్పందించని టెక్ కంపెనీలు

'మీరు శిక్షణ ఇవ్వదలుచుకుంటే, మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల పట్టభద్రులకి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. టెక్నాలజీ రంగం ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తుందని ట్రంప్ తెలిపారు. అయితే, దిగ్గజ టెక్ కంపెనీలు—యాపిల్‌, గూగుల్‌, మెటా—ఇంతవరకు స్పందించలేదు. హెచ్‌-1బీ వీసాను 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్ కంపెనీలు వీటిని జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71%, చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య కాలానికి మంజూరు చేస్తారు.

Details

లాటరీలో ఎంపికైన తర్వాత అదనపు ఛార్జీలు

ప్రస్తుతం H-1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత సాధారణ ఛార్జీలు, లాటరీలో ఎంపికైన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం కంపెనీలకు భారీ భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H-1B వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. ఇంకా, ట్రంప్ గోల్డ్ కార్డు విధానాన్ని కూడా ప్రకటించారు. దీని కోసం $1,000,000 (10 లక్షల డాలర్లు) రుసుము విధించారు. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని, వీటిని పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని ఆయన తెలిపారు.