USA-Canada: టీవీ ప్రకటన ఎఫెక్ట్.. వాణిజ్య చర్చలు నిలిపివేసిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు. యూఎస్ సుంకాలపై కెనడా చేసిన ప్రకటనలు ఆయన ఆగ్రహానికి కారణమని పేర్కొన్నారు.ఇది దారుణమైన ప్రవర్తన అని సోషల్‌మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. "అమెరికా జాతీయ భద్రత,ఆర్థిక వ్యవస్థలో సుంకాల పాత్ర కీలకం. కెనడా దారుణమైన ప్రవర్తన వల్ల అన్ని వాణిజ్య చర్చలను రద్దు చేస్తున్నాం" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ డగ్ ఫోర్డ్ స్పందిస్తూ, "ఒంటారియో కొత్త ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. అమెరికా సుంకాల వ్యతిరేకతలో మా ప్రచారాన్ని కొనసాగిస్తాం. అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగించుకుందాం. కలిసి పనిచేయడం ఇరుపక్షాల శ్రేయస్సుకు ఉత్తమ మార్గం" అని పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా-కెనడాల మధ్య మాటల యుద్ధం
అమెరికాలో సుంకాల కారణంగా వ్యాపార ముప్పులు పెరుగుతున్న నేపథ్యంతో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇతర దేశాలకి ఎగుమతులను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ వాణిజ్య చర్చలను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతానికి, అమెరికా-కెనడా మధ్య వస్తువుల దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 35 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. అలాగే, వివిధ రంగాలవారీగా కూడా సుంకాలు ప్రకటించారు. అయితే, అమెరికా-మెక్సికో-కెనడా అగ్రిమెంట్ కింద కవర్ అయ్యే వస్తువులపై మినహాయింపులు ఇచ్చారు. ఈ ప్రకటనలతో,రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ఉధృతమై, సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఇటీవల, ట్రంప్,కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య సమావేశం జరిగినప్పటికీ, ఆ చర్చల నుంచి పెద్దగా ఫలితం లభించలేదని వెల్లడైంది.
వివరాలు
కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని డిమాండ్
కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని కెనడా ప్రభుత్వం ఖండిస్తూ, తమ దేశాన్ని అమ్మకానికి ఉద్దేశించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే పొరుగుదేశంపై సుంకాలు విధించారు, అందుకు ప్రతిగా కెనడా కూడా ప్రతిసుంకాలను ప్రకటించింది.