
Donald Trump: ఐరాసలో వరుస సాంకేతిక లోపాలు - కుట్రేనా?: రహస్య విచారణకు ట్రంప్ ఆదేశం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన భార్య మెలానియాతో కలిసి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి హాజరైన ఆయన, 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. అయితే అక్కడ ఎదురైన అనుభవాలు సాధారణమేమీ కావని, వాటి వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఐరాసలో వరుసగా ఎదురైన సమస్యలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మూడు వేర్వేరు సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎస్కలేటర్ ఆగిపోవడం, టెలిప్రాంప్టర్ పని చేయకపోవడం, మైక్ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు యాదృచ్ఛికమని చెప్పలేమని, ఎవరో కావాలనే అడ్డంకులు సృష్టించారని ఆయన అనుమానించారు.
వివరాలు
ప్రింటెడ్ కాపీ ద్వారా ట్రంప్ ప్రసంగం
మొదటగా, ట్రంప్ తన భార్య మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్‌పై ప్రయాణిస్తుండగా అది ఒక్కసారిగా ఆగిపోయిందని చెప్పారు. రెండో ఘటనలో, జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించబోయే సమయంలో టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. దాంతో ఆయన ప్రింటెడ్ కాపీ ద్వారా ప్రసంగాన్ని కొనసాగించారు. మూడో సమస్యగా, ప్రసంగం జరుగుతున్న సమయంలో మైక్ పనిచేయకపోవడంతో అక్కడి వారు, మెలానియాతో సహా, ఆయన మాటలు నేరుగా వినలేకపోయారని, చివరికి ఇంటర్‌ప్రెటర్ల సహాయంతో మాత్రమే వినిపించిందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఆయన సమావేశ ప్రాంగణంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వివరాలు
ట్రంప్ ఆరోపణలను తోసిపుచ్చిన ఐరాస
ఇలాంటి సమస్యలు యాదృచ్ఛికం కావని, తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందనే భావన కలుగుతోందని ట్రంప్ తెలిపారు. వీటిపై విచారణ జరపాలని రహస్య దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్దవారైనా, ఈ కుట్రలో పాలుపంచుకున్నట్లయితే వదిలిపెట్టమని హెచ్చరించారు. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ట్రంప్ ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధి బృందంలో ఉన్న ఒక వీడియోగ్రాఫర్ పొరపాటున స్టాప్ బటన్ నొక్కడం వల్లే ఎస్కలేటర్ ఆగిపోయి ఉండొచ్చని ఐరాస ప్రతినిధి ఒకరు చెప్పారు. అలాగే టెలిప్రాంప్టర్ నిర్వహణ పూర్తిగా వైట్ హౌస్ బాధ్యతేనని, ఆ విషయంలో తమపై నిందలు వేయడం సరికాదని స్పష్టం చేశారు.
వివరాలు
యూఎన్‌కు ప్రధానంగా ఆర్థిక సాయం అందించేది అమెరికా
ఇదిలా ఉంటే, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇక్కడ నిర్వహణ లోపాలు తరచూ బయటపడుతుంటాయి. ముఖ్యంగా నిధుల కొరత కారణంగా ఈ మధ్య కాలంలో సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జెనీవాలోని కార్యాలయంతో పాటు న్యూయార్క్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా ఎలివేటర్లు,ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు తాత్కాలికంగా ఆపివేస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. యూఎన్‌కు ప్రధానంగా ఆర్థిక సాయం అందించేది అమెరికా. అయితే అమెరికా నుంచి నిధులు తగ్గిపోవడంతో ఐరాస ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొంటోందని సమాచారం.