LOADING...
Donald Trump: జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాల నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు ట్రంప్‌
జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాల నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు ట్రంప్‌

Donald Trump: జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాల నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

జన్మతః పౌరసత్వం రద్దు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా ఉన్నారు. తాజాగా, ఫెడరల్‌ కోర్టులు ఆయన ఉత్తర్వులను నిలిపివేయడంతో, దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాక్టింగ్‌ సొలిసిటర్‌ జనరల్‌ సారా హారిస్‌ ఈ పిటిషన్‌ను సాధారణ అంశంగా అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే, ట్రంప్‌ ఉత్తర్వులు రాజ్యాంగబద్ధమైనవా? కాదా? అనే అంశంపై ఏవైనా అభిప్రాయాలు కోరడం లేదు. ట్రంప్‌ జారీ చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు తీవ్రమైన న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలవడంతో, కోర్టులు నిరోధన ఉత్తర్వులు ఇచ్చాయి.

వివరాలు 

14వ రాజ్యాంగ సవరణ ప్రకారం,అమెరికా గడ్డపై జన్మించినవారంతా ఆ దేశ పౌరులు

ట్రంప్‌ ప్రభుత్వ ఉత్తర్వులు, దేశ కార్యనిర్వాహక విభాగం రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయని అభిప్రాయపడ్డాయి. ఇటీవల, ట్రంప్‌ ప్రభుత్వం తొలగించిన పలువురు ప్రొబేషనరీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం, ఆ దేశ పౌరసత్వం అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. 1868లో అమలులోకి వచ్చిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం,అమెరికా గడ్డపై జన్మించినవారంతా ఆ దేశ పౌరులుగా పరిగణించబడతారు. శరణార్థుల పిల్లలు కూడా ఈ పౌరసత్వాన్ని పొందే హక్కును కలిగి ఉంటారు. ఇప్పటివరకు ఈ విధానం కొనసాగుతూనే ఉంది.

వివరాలు 

అమెరికాలో5.4 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు

అయితే, ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దీనికి అడ్డుకట్ట పడింది. ట్రంప్‌ ఉత్తర్వుల ప్రకారం, బిడ్డ పుట్టిన సమయంలో తల్లిదండ్రులు అమెరికా పౌరులుగా లేకపోయినా, తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నా కానీ శాశ్వత నివాసి కాకపోయినా, ఆ బిడ్డకు పౌరసత్వం ఇవ్వబడదు. అదేవిధంగా, తండ్రి శాశ్వత నివాసి అయినా, తల్లి తాత్కాలిక వీసాపై ఉంటే కూడా అదే నియమం వర్తిస్తుంది. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం అమెరికా జనాభాలో భారతీయులు సుమారు 1.47 శాతం ఉన్నారు. వీరిలో 34 శాతం మంది అమెరికాలో జన్మించినవారే.