Donald Trump: మీడియాపై మరోసారి విమర్శల వర్షం కురిపించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. వైట్‌హౌస్ వ్యవహారాలను కవర్ చేసే మీడియా ప్రతినిధుల కోసం నిర్వహించిన కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు జర్నలిస్టులపై విమర్శలు గుప్పించిన ట్రంప్, మరికొందరిని ప్రశంసించడంతో పాటు రాజకీయ నాయకులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ దాదాపు గంటపాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను మూడోసారి కూడా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
కాల్పులకు పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు..
నిజానికి వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది.
అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భద్రతా కారణాల దృష్ట్యా ఆ సమావేశాన్ని వాయిదా వేయగా, చివరకు శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ట్రంప్, తాను చెప్పాలని అనుకున్న అనేక అంశాలను తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
"ఈ ప్రసంగాన్ని ఏప్రిల్‌లోనే ఇవ్వాలని భావించాను. కానీ గన్‌మ్యాన్ కాల్పుల కారణంగా కార్యక్రమాన్ని తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది" అని తెలిపారు.
వివరాలు
పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు..
"మూడు నెలల క్రితం చెప్పినట్లుగానే... షో కొనసాగుతూనే ఉండాలి" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్, ఆ రోజు సామూహిక హత్యలు జరిగే ప్రమాదం కూడా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం తనకు అలవాటైన శైలిలో హాస్యం, వ్యంగ్యం మేళవిస్తూ పలువురిపై విమర్శలు చేశారు.
వచ్చే ఏడాది కూడా కరెస్పాండెంట్స్ డిన్నర్‌కు తాను హాజరవుతానని ప్రకటించారు.
ట్రంప్‌కు మీడియాతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ డిన్నర్ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా సంస్థలు, విలేకరులపై ఆయన పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, కొందరిపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించడం, మరికొందరిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవడం తెలిసిందే.