Pakistan: భిక్షాటనతో పాక్ పరువు తీయొద్దు.. సౌదీ వెళ్లేవారికి ఇస్లామాబాద్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులపై భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమంగా నివసించడం వంటి ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హజ్, ఉమ్రా యాత్రల కోసం సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ భిక్షాటన చేయవద్దని గట్టిగా సూచిస్తోంది.
వివరాలు
స్థానిక చట్టాలు పాటించాల్సిందే
సౌదీ అరేబియాలోని పాకిస్థాన్ ఎంబసీ తాజాగా తమ పౌరులకు పలు సూచనలు చేసింది.
హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు సౌదీలో ఉద్యోగాలు చేస్తున్న పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలు, వీసా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.
ముఖ్యంగా మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన చేయడం, అనుమతి లేకుండా విరాళాలు లేదా నగదు సేకరించడంపై సౌదీ అధికారులు 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, దేశం నుంచి బహిష్కరణ (డిపోర్టేషన్) వంటి కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వివరాలు
ఏఐ వీడియోతో అవగాహన
తమ హెచ్చరికను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఏఐ రూపొందించిన వీడియోను కూడా విడుదల చేసింది.
అందులో ఒక వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో యాత్రికులకు వివరించేలా వీడియోను రూపొందించారు.
అనుమతి లేని సేవలను ఉపయోగించుకోవద్దని, ఆర్థిక సహాయం లేదా విరాళాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే సేకరించాలని ఎంబసీ సూచించింది.
విదేశాల్లో పాకిస్థాన్ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దనే సందేశాన్ని కూడా పరోక్షంగా ఇచ్చింది.
వివరాలు
సౌదీ నుంచే వేలాది మంది వెనక్కి
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన వ్యవహారం కొత్తదేమీ కాదు. పాక్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా నుంచి సుమారు 24 వేల మంది పాకిస్థానీయులను భిక్షాటనకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో వెనక్కి పంపినట్లు సమాచారం.
యూఏఈ నుంచి దాదాపు 6 వేల మంది, అజర్‌బైజాన్ నుంచి సుమారు 2,500 మంది పాక్ పౌరులను కూడా వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు.
అయితే వీరందరినీ కేవలం భిక్షాటన కేసుల కారణంగానే డిపోర్ట్ చేయలేదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన కేసులు కూడా డిపోర్టేషన్‌కు కారణాలుగా ఉన్నాయని పేర్కొంది.
వివరాలు
38,616 మంది డిపోర్ట్
పాక్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల నుంచి వివిధ కారణాలతో మొత్తం 38,616 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు.
వీరిలో సౌదీ అరేబియా నుంచి 27,692 మంది, యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది ఉన్నారు.
అయితే ఈ సంఖ్యలో ఉన్న వారంతా భిక్షాటనకు సంబంధించిన కేసుల్లోనే వెనక్కి పంపినవారు కాదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
విమానాశ్రయాల్లోనే అడ్డుకట్ట
విదేశాల్లో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలోనే చర్యలు ప్రారంభించింది.
2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని పాక్ విమానాశ్రయాల్లోనే 'ఆఫ్‌లోడ్' చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది.
సరైన ప్రయాణ పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా పలువురిని విమానాశ్రయాల్లోనే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
బెగ్గింగ్ నెట్‌వర్క్‌లపై FIA దృష్టి
ఈ వ్యవహారంలో వ్యవస్థీకృత భిక్షాటన నెట్‌వర్క్‌లు, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపైనా FIA దృష్టి సారించింది.
కొందరు ఉమ్రా వీసాలను ఉపయోగించుకుని సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మరికొందరు సౌదీ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
2024లోనే సౌదీ హెచ్చరిక
పాకిస్థానీయుల భిక్షాటన వ్యవహారంపై సౌదీ అరేబియా 2024లోనే పాకిస్థాన్‌ను హెచ్చరించింది.
ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయకుండా తమ పౌరులకు స్పష్టంగా చెప్పాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది.
మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది.
అయినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటంతో పాకిస్థాన్ తాజాగా మరోసారి తన పౌరులను అప్రమత్తం చేసింది.
వివరాలు
దేశ ప్రతిష్ఠపై ఆందోళన
విదేశాల్లో భిక్షాటన, అక్రమ వలసల నెట్‌వర్క్‌లు పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాక్ సెనేట్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు.
వారిలో 1,064మందిని భిక్షాటనకు సంబంధించిన కారణాలతో వెనక్కి పంపినట్లు వెల్లడైంది.
ఈ నేపథ్యంలో హజ్,ఉమ్రా యాత్రికులకు పాకిస్థాన్ ఎంబసీ ఇచ్చిన తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
విదేశాల్లో భిక్షాటనకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని,సౌదీ చట్టాలను కచ్చితంగా పాటించాలని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది.
హజ్,ఉమ్రా యాత్రల సమయంలో జరిగే ఒక్కో ఘటన మొత్తం పాకిస్థాన్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.