Loading...
El Chapo Isidro Arrest: డ్రగ్‌ మాఫియా డాన్‌ అరెస్టు.. మెక్సికోలో కార్టెల్‌ బీభత్సం!
డ్రగ్‌ మాఫియా డాన్‌ అరెస్టు.. మెక్సికోలో కార్టెల్‌ బీభత్సం!

El Chapo Isidro Arrest: డ్రగ్‌ మాఫియా డాన్‌ అరెస్టు.. మెక్సికోలో కార్టెల్‌ బీభత్సం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మోస్ట్‌ వాంటెడ్ జాబితాలో ఉన్న కరుడుగట్టిన డ్రగ్‌ మాఫియా నాయకుడు ఎల్‌ చాపో ఇసిడ్రో అరెస్టుతో మెక్సికోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అతడిని అదుపులోకి తీసుకున్న అనంతరం కార్టెల్‌ సభ్యులు పలు ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. ట్రక్కులు, ఇతర వాహనాలకు నిప్పంటించడంతో పాటు హైవేలను దిగ్బంధించారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సైనిక హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించారు.

వివరాలు

అమెరికా నిఘా సమాచారంతో ఆపరేషన్

44 ఏళ్ల ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్‌ అలియాస్‌ ఎల్‌ చాపో ఇసిడ్రోను శుక్రవారం అరెస్టు చేశారు. అతడితో పాటు అతడి సంస్థకు చెందిన మరో ఇద్దరు కీలక సభ్యులను కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

మెక్సికన్‌ సైన్యం, నేషనల్‌ గార్డ్‌ ప్రత్యేక బలగాలు అమెరికా నిఘా సంస్థలు అందించిన సమాచారంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి.

ఈ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరగడంతో పాటు పేలుడు పదార్థాలతో దాడులు జరిగినట్లు మెక్సికో రక్షణ శాఖ వెల్లడించింది.

డ్రగ్‌ మాఫియా సభ్యుల నుంచి ఎదురైన ప్రతిఘటన మధ్య ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపింది.

వివరాలు

ట్రక్కులకు నిప్పు.. హైవేలపై బీభత్సం

ఎల్‌ చాపో ఇసిడ్రో అరెస్టు విషయం తెలియడంతో కార్టెల్‌ సభ్యులు పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. ట్రక్కులు, ఇతర వాహనాలను తగులబెట్టి రహదారులను మూసివేశారు.

దీంతో హైవేలపై ప్రయాణిస్తున్న వాహనదారులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు.

పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

సైనిక హెలికాప్టర్ల నుంచి కూడా కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

బేస్‌బాల్‌ మ్యాచ్‌ మధ్యలోనే రద్దు

గువాసావేలో బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించడంతో నిర్వాహకులు పోటీని మధ్యలోనే రద్దు చేశారు.

భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు నెలకొనడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

డ్రగ్స్‌ అక్రమ రవాణాలో కీలక పాత్ర

ఎల్‌ చాపో ఇసిడ్రోపై కొకైన్‌, హెరాయిన్‌, మెథాంఫెటమైన్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో 2025లో ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మెక్సికోపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో మరో డ్రగ్‌ మాఫియా నాయకుడు ఎల్‌ మెంచో మరణించిన తర్వాత కూడా మెక్సికోలో ఇదే తరహాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు ఎల్‌ చాపో ఇసిడ్రో అరెస్టుతో మరోసారి ఆ దేశంలో అశాంతి నెలకొంది.

ADVERTISEMENT