LOADING...
Dubai: దుబాయ్‌లో విషాదం.. ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు, ఏడుగురు భారతీయుల మృతి
దుబాయ్‌లో విషాదం.. ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు, ఏడుగురు భారతీయుల మృతి

Dubai: దుబాయ్‌లో విషాదం.. ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు, ఏడుగురు భారతీయుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎమిరేట్స్ రోడ్డుపై సాంకేతిక లోపంతో ఆగిపోయిన ట్రక్కును వెనుక నుంచి వచ్చిన మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎక్స్ వేదికగా సంతాపం తెలిపింది. క్షతగాత్రులకు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వెల్లడించారు.

వివరాలు 

ఘటనలో గాయపడిన తొమ్మిది మందికి చికిత్స

ప్రాథమిక విచారణలో సాంకేతిక లోపం కారణంగా ట్రక్కు ఎమిరేట్స్ రోడ్డుపై అకస్మాత్తుగా నిలిచిపోయినట్లు తేలిందన్నారు. ఆగి ఉన్న ట్రక్కును బస్సు డ్రైవర్ గుర్తించడంలో విఫలమవడంతో పాటు, వాహనాల మధ్య ఉండాల్సిన సురక్షిత దూరాన్ని పాటించకపోవడం వల్ల మినీ బస్సు వెనుక నుంచి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు వారిని పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దుబాయ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement