టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు
టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపాల ధాటికి టర్కీలో 12,391 మంది మరణించగా, 62,914 మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. సిరియాలో మొత్తం మరణాల సంఖ్య 2,992కు చేరుకుంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న వాయువ్య ప్రాంతంలో ప్రాంతాల్లో 1,730 మంది మరణించినట్లు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం 1,262 మంది మృతి చెందారని సీఎన్ఎన్ నివేదించింది. తిరుగుబాటుదారులు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో 5,108 మంది గాయపడినట్లు పేర్కొంది.
భూకంపాల వల్ల 13 మిలియన్ల మందికిపైగా ప్రజలు ప్రభావితం
భూకంప ప్రభావిత ప్రాంతాలను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసంలో తమ లోపాలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి విపత్తులను ముందే ఊహించి సిద్దంగా ఉండటం సాధ్యం కాదన్నారు. అయినా తమ పౌరుల్లో ఎవరినీ పట్టించుకోకుండా వదిలిపెట్టలేమన్నారు. ఒక్క హటే సహాయక చర్యల్లోనే సైనికులు, పోలీసులతో సహా మొత్తం 21,200మంది సిబ్బంది పని చేస్తున్నట్లు చెప్పారు. అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడు నెలల అత్యవసర పరిస్థితిని టర్కీ ప్రకటించింది. విధ్వంసకర భూకంపాల తర్వాత టర్కీ ఏడు రోజుల సంతాప దినాలు పాటిస్తోంది. భూకంపాల వల్ల 13 మిలియన్ల మందికిపైగా ప్రజలు ప్రభావితమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.