Japan Earthquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. సునామీ అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో మూడు మీటర్ల (సుమారు 10 అడుగులు) ఎత్తులో అలలు ఎగసి పడే అవకాశం ఉందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్‌లోని సన్రికు ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
భారతదేశానికి ఎలాంటి ప్రమాదమూ లేదు
తదుపరి సూచనలు వచ్చే వరకు ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని అధికార యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఇక ఈ భూకంప ప్రభావంపై భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) స్పష్టం చేసింది. సునామీ ప్రభావం సాధారణంగా కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలోనే పరిమితమవుతుందని తెలిపింది. అయితే సముద్ర పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని, ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే సమాచారం అందిస్తామని INCOIS వెల్లడించింది.