Ebola Outbreak: కాంగోలో ఎబోలా విజృంభణ.. 2,344 కేసులు,930 మందికి పైగా మృతులు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మే 15 నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,344ఎబోలా కేసులు నమోదైనట్లు కాంగో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 930మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కేవలం శుక్రవారం నుంచి 24గంటల వ్యవధిలోనే మరో 37మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాంగోలో నమోదవుతున్న అన్ని కేసులు బుండిబుగ్యో ఎబోలా(Bundibugyo Ebola)రకానికి చెందినవేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని మే 15న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఎబోలా రకాన్ని నివారించేందుకు ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు
ఎబోలా ఎలా వ్యాపిస్తుంది?
ఎబోలా వైరస్ సాధారణంగా అడవి జంతువులు, ముఖ్యంగా గబ్బిలాల్లో కనిపిస్తుంది.
వైరస్ సోకిన జంతువులను వేటాడి వాటి మాంసం (బుష్‌మీట్) తినడం ద్వారా మనుషులకు సంక్రమించే అవకాశం ఉంటుంది.
అనంతరం వైరస్ సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, వాంతులు వంటి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు కూడా సులభంగా వ్యాపిస్తుంది.
వివరాలు
లక్షణాలు ఎలా ఉంటాయి?
ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 21 రోజుల వరకు పట్టొచ్చు.
ప్రారంభంలో ఫ్లూ, మలేరియా లేదా సాధారణ జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది.
అనంతరం తీవ్ర జ్వరం, నీరసం, కండరాల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిస్థితి మరింత విషమిస్తే అవయవాల వైఫల్యానికి దారితీయవచ్చు.
కొన్ని కేసుల్లో శరీరం లోపల, బయట రక్తస్రావం కూడా కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.