WHO: కాంగోలో ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ఈ వార్తాకథనం ఏంటి
ఎబోలా వైరస్ మరోసారి ఆఫ్రికా ఖండాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ ఇప్పటివరకు 88 మంది ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించగా, మరో 300 మందికి పైగా వైరస్ సోకినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు తక్షణ ప్రమాదం లేకపోయినా, కాంగో సరిహద్దు దేశాలకు వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. ఇతర దేశాల్లో కూడా ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది.
వివరాలు
17వ సారి వ్యాప్తి
1976లో తొలిసారిగా కాంగోలో ఎబోలా వైరస్‌ను గుర్తించినప్పటి నుంచి ఇది 17వసారి వ్యాప్తి చెందుతున్నట్లు WHO వెల్లడించింది. ప్రాథమిక నమూనాల్లో అధిక పాజిటివిటీ రేటు నమోదవడం, రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆమోదం పొందిన ప్రత్యేక చికిత్సలు లేదా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని WHO తెలిపింది. అందువల్ల వైరస్‌ను వెంటనే పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సవాల్‌గా మారిందని పేర్కొంది.
వివరాలు
అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఆరోగ్య పరీక్షలు
ప్రపంచ దేశాలు తమ జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ వ్యవస్థలను వెంటనే అప్రమత్తం చేయాలని WHO సూచించింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కోరింది. అయితే వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయడం, ప్రయాణాలు లేదా వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇతర దేశాలకు ప్రయాణించవద్దని WHO హెచ్చరించింది. ఎబోలా నిర్ధారణ అయిన వారిని తక్షణమే క్వారంటైన్‌లో ఉంచి, వారి సంప్రదింపులోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది.