Loading...
US-Iran: ఇరాన్‌పై ఆర్థిక దాడి తప్పదు.. ట్రంప్‌ హెచ్చరికలతో హార్ముజ్‌లో టెన్షన్‌!
ఇరాన్‌పై ఆర్థిక దాడి తప్పదు.. ట్రంప్‌ హెచ్చరికలతో హార్ముజ్‌లో టెన్షన్‌!

US-Iran: ఇరాన్‌పై ఆర్థిక దాడి తప్పదు.. ట్రంప్‌ హెచ్చరికలతో హార్ముజ్‌లో టెన్షన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరించడంతో.. ఇరాన్‌ కూడా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ముఖ్యంగా కీలకమైన హార్ముజ్‌ జలసంధిలో నౌకలపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాలు

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొడతాం: ట్రంప్

యుద్ధాన్ని ముగించేందుకు సరైన మార్గాన్ని కనుగొనడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శుక్రవారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేందుకు అమెరికా సిద్ధమవుతోందని హెచ్చరించారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల నాటికి యుద్ధం ముగుస్తుందా లేదా అన్నది తనకు పెద్దగా పట్టింపు లేదని చెప్పారు.

అదే రోజు లాంగ్‌ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని 'ఉక్కు గోడ'గా అభివర్ణించారు.

దీని ద్వారా హార్ముజ్‌ జలసంధిపై అమెరికా సమర్థవంతంగా నియంత్రణ సాధించగలదని అన్నారు. త్వరలోనే హార్ముజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

వివరాలు

హార్ముజ్‌లో నౌకలపై వరుస దాడులు

ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ కూడా దాడులను తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. హార్ముజ్‌ జలసంధిలో నౌకలపై దాడులు పెరిగాయి.

శనివారం యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌కు ఓ బల్క్‌ క్యారియర్‌ నౌకను గుర్తుతెలియని ప్రాజెక్టైల్‌ ఢీకొట్టినట్లు సమాచారం అందింది.

అంతకుముందు గురువారం హార్ముజ్‌ జలసంధి గుండా వెళ్తున్న అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడులు జరిగాయి.

శుక్రవారం సాయంత్రం మరో నౌక కూడా దాడికి గురైనట్లు యూఏఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డబ్ల్యూఏఎం వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఘటనల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

ADVERTISEMENT

వివరాలు

ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం

యుద్ధానికి ముందు ప్రపంచంలోని మొత్తం చమురు, గ్యాస్‌ రవాణాలో దాదాపు ఐదో వంతు హార్ముజ్‌ జలసంధి మీదుగానే సాగేది.

దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు జరుగుతున్న చర్చల్లో ఈ జలమార్గం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.

పర్షియన్‌ గల్ఫ్‌ను గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, అరేబియా సముద్రంతో అనుసంధానించే హార్ముజ్‌ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలను పునరుద్ధరించాలని అమెరికా కోరుతోంది.

అయితే జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది.

చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లకు చమురు, ఇతర కీలక వస్తువుల సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.

ADVERTISEMENT

వివరాలు

దాదాపు 6 శాతం పెంపు 

దీంతో ప్రపంచ మార్కెట్‌కు ప్రధాన సూచికగా భావించే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగింది.

అంతర్జాతీయ సముద్ర సంస్థ లెక్కల ప్రకారం.. ఆగస్టు 11 నాటికి యుద్ధ సమయంలో హార్ముజ్‌తో పాటు విస్తృత మధ్యప్రాచ్య ప్రాంతంలో నౌకలకు సంబంధించిన 65 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 17 మంది సముద్ర సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

దిలా ఉండగా హార్ముజ్‌ జలసంధి మీదుగా ప్రత్యేక నౌకా రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఇరాన్‌, ఒమన్‌ మధ్య చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి.

వివరాలు

ఇరాన్‌-ఒమన్‌ మధ్య సాంకేతిక చర్చలు

ఇఈ చర్చల్లో అమెరికా భాగస్వామి కాదు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ శనివారం మాట్లాడుతూ.. ఒమన్‌తో సాంకేతిక చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అవి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

అయితే ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన హార్ముజ్‌ జలసంధి పూర్తిగా తిరిగి తెరుచుకుంటుందని భావించరాదని స్పష్టం చేశారు.

హార్ముజ్‌ను తెరవడం వేరే అంశమని, అందుకు అమెరికా కొన్ని షరతులను నెరవేర్చాల్సి ఉంటుందని అరాఘ్చీ పేర్కొన్నారు.

ఖతార్‌, పాకిస్థాన్‌ మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌-అమెరికా మధ్య సందేశాల మార్పిడి జరుగుతోందని, అయితే దాన్ని అధికారిక చర్చలుగా పరిగణించలేమని చెప్పారు.

అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించడంపై ఇరాన్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

వివరాలు

అమెరికాపై పెరుగుతున్న ఒత్తిడి

ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలోనే అమెరికా కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కొంటోంది.

ముఖ్యమైన ఆయుధాల కొరతతో పాటు విస్తృత సైనిక చర్యలపై దేశీయంగా వ్యతిరేకత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధి భద్రత, అంతర్జాతీయ చమురు సరఫరా, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు మధ్యప్రాచ్య సంక్షోభంలో మరింత కీలక అంశాలుగా మారుతున్నాయి.

ADVERTISEMENT