LOADING...
US: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఉక్కుపాదం.. రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు
ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఉక్కుపాదం.. రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు

US: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఉక్కుపాదం.. రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు శ్రీకారం చుట్టారు. 'ఎకనామిక్ ఫ్యూరీ'పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి చర్యల్లో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, కొన్ని బ్యాంకులు, వ్యక్తులపై విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ..ఇరాన్ రహస్యంగా నడుపుతున్న'షాడో బ్యాంకింగ్'వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో నిధులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతున్నాయని ఆరోపించారు. ఈ నిధులు ఇరాన్ సైన్యం,క్షిపణి కార్యక్రమాలు,ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఇరాన్ సైనిక యంత్రాంగానికి ఆర్థికంగా బలంగా నిలుస్తోందని తెలిపారు.

వివరాలు 

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ వ్యవస్థకు తోడ్పడే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విదేశీ అధికార పరిధిలో ఉన్న షెల్ ఖాతాల ద్వారా ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి అక్రమ ప్రవేశం కల్పిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా, 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించిన దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా నిర్ణయాలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులు స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంస్థలతో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి దూరమయ్యే ప్రమాదం నెలకొంది.

వివరాలు 

బ్యాంకులకు భారీ దెబ్బ

అమెరికా ఆంక్షల జాబితాలో ఇరాన్‌కు చెందిన బ్యాంక్ సెపా(Bank Sepah)అనుబంధ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంకు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సదెరాత్ ఇరాన్ సుప్రీం నేత నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్సియన్ బ్యాంకులతో సంబంధాలు ఉన్న సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఇరాన్ చమురు సంస్థలకు నిధులు తరలించే నెట్‌వర్క్‌ను అడ్డుకోవడమే తాజా చర్యల లక్ష్యంగా కనిపిస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకూన్ లిమిటెడ్ సంస్థ 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

చైనా రిఫైనరీలకు హెచ్చరిక

ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న చిన్న స్వతంత్ర రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులపై కూడా ఆంక్షలు విధిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ముఖ్యంగా షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న ఈ రిఫైనరీలు అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉండటంతో ఇరాన్ చమురు కొనుగోళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రిఫైనరీలకు ఆర్థిక, బీమా, రవాణా సేవలు అందించే సంస్థలు కూడా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

Advertisement