Trump: విద్యావంతుడే.. కానీ కాల్పులకు పాల్పడ్డాడు.. ట్రంప్ నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఉన్నత విద్యావంతుడు అని తెలిసింది. దర్యాప్తు సంస్థలు అతడిని 31ఏళ్ల కోలో టామోస్ అలెన్‌గా గుర్తించాయి. టోరెన్స్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి, కాలిఫోర్నియాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసినట్లు వెల్లడైంది. కాల్టెక్‌లో విద్యార్థిగా ఉన్న సమయంలోనే వీల్‌చైర్స్‌కు ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్‌ను రూపొందించడం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ ఆవిష్కరణపై స్థానిక పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అనంతరం కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2018లో ఒక వీడియో గేమ్‌ను అభివృద్ధి చేసి ట్రేడ్‌మార్క్ కోసం నమోదు చేసుకున్నాడు.
వివరాలు
డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడిగా గుర్తింపు
ఇటీవల 'ఫస్ట్‌లా' పేరుతో మరో గేమ్‌పై పనిచేస్తున్నట్లు తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. ఇంకా, 2014లో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో నిర్వహించిన ఫెలోషిప్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం టెస్ట్ ప్రిపరేషన్ ట్యూటరింగ్ సంస్థ అయిన C2 Educationలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. 2024 డిసెంబర్‌లో 'టీచర్ ఆఫ్ ది మంత్'గా కూడా ఎంపికైనట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ పరంగా చూస్తే, అతడు డెమోక్రటిక్ పార్టీకు సానుభూతిపరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 25 డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.