గాజాలో ఆస్పత్రి దాడుల బాధితులకు అమెరికా, ఈజిప్ట్ సాయం.. చొరవ తీసుకున్న జో బైడెన్
హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జనం తమ ఆవాసాలను కోల్పోయి బిక్కు బిక్కుమంటున్నారు. ఈ క్రమంలోనే లక్షల్లో ఉన్న బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది.ఇదే సందర్భంగా గాజాకి రూ. 832 కోట్ల సాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ సాయం గాజాలోకి చేరాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ మార్గం ద్వారానే దాటాల్సి ఉంటుంది. రఫా సరిహద్దు వద్ద ఇప్పటికే వందలాది ట్రక్కులు సాయం అందించేందుకు బారులు తీరి ఉన్నాయి. మరోవైపు భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసేసింది.
ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉంది : ఈజిఫ్ట్
తమ దేశంలోకి గాజా ప్రజలు ప్రవేశించి ఇక్కడే స్థిరపడే అవకాశం ఉందని ఈజిఫ్ట్ పేర్కొంది. మరోవైపు ఉగ్రవాదులు సైతం చొరబడే ప్రమాదముందని చెప్పింది. దీంతో బైడెన్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. గాజాకు సాయం చేసేందుకు లైన్ క్లియర్ అయినప్పటికీ, అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ పేర్కొంది. హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు సమయం పడుతుందని వివరించింది. శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది.
ఈజిఫ్ట్ దేశాధినేతతో మాట్లాడిన జో బైడెన్
తాను ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడానని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద అందించే సామగ్రితో కూడిన 20 ట్రక్కులను గాజాలోకి వెళ్లేందుకు సహకరిస్తామని చెప్పినట్లు బైడెన్ పేర్కొన్నారు. గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన వెలువరించింది. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు అమెరికా, ఈజిప్ట్ దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుపక్షాల అధినేతలు కట్టుబడి ఉన్నారని వైట్ హౌజ్ స్పష్టం చేసింది.