Loading...
Eiffel Tower: హిందూ మత బృందం పర్యటనలో వివాదం.. మహిళల స్థానంలో పురుషులను నియమించడంపై ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె
ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె

Eiffel Tower: హిందూ మత బృందం పర్యటనలో వివాదం.. మహిళల స్థానంలో పురుషులను నియమించడంపై ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ ఐఫిల్ టవర్ సోమవారం సిబ్బంది నిరసనతో మూతపడింది. హిందూ మత సంస్థకు చెందిన ఓ బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను వారి పని ప్రదేశాల నుంచి తప్పించారన్న ఆరోపణలపై సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘం ప్రతినిధులు,ఐఫిల్ టవర్ నిర్వహణ సంస్థ వెల్లడించాయి. బోచసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ(BAPS)కు చెందిన సుమారు 100మంది ప్రతినిధులు శనివారం ఐఫిల్ టవర్‌ను సందర్శించారు. ఈ బృందం వచ్చిన సమయంలో కొందరు మహిళా సిబ్బందిని తమ పనిప్రదేశాల నుంచి వెళ్లిపోవాలని,వారి స్థానాల్లో పురుషులను ఉంచాలని కోరినట్లు ఉద్యోగ సంఘం ప్రతినిధి డయాన్ దావోయిన్ తెలిపారు. ఈ ఘటనపై యాజమాన్యం ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిందని ఆమె వెల్లడించారు.

వివరాలు 

ఐఫిల్ టవర్‌ను నిర్వహించే SETE ఈ విషయాన్ని ధ్రువీకరించింది

ఈ పరిణామం మహిళా ఉద్యోగులను తీవ్రంగా అవమానించిందని దావోయిన్ అన్నారు.

వారాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సోమవారం సిబ్బంది సమావేశమయ్యారని తెలిపారు.

యాజమాన్యంతో చర్చలు జరపడంతో పాటు భవిష్యత్తులో కంపెనీలో మహిళలను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టకుండా చూడాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.

ఐఫిల్ టవర్‌ను నిర్వహించే సొసైటీ దెక్స్‌ప్లాయిటేషన్ ద ల టూర్ ఐఫిల్ (SETE) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

మహిళలతో పరస్పర సంబంధాలను పరిమితం చేసేలా పర్యటనను నిర్వహించాలని బృందం కోరిందని తెలిపింది.

అయితే ఇలాంటి షరతులను అంగీకరించాల్సింది కాదని సంస్థ పేర్కొంది. ఇవి SETE విలువలకు, మహిళలు-పురుషుల సమానత్వ సూత్రాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేసింది.

వివరాలు 

ఫ్రాన్స్‌లో తన తొలి ప్రధాన ఆలయాన్ని ప్రతిష్టించిన BAPS

SETE అధ్యక్షుడు ఏరియల్ వెయిల్ మాట్లాడుతూ.. మహిళలను పక్కకు తప్పించే విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ఫ్రాన్స్ గణతంత్ర విలువలకు,మహిళలు-పురుషుల సమానత్వానికి ఐఫిల్ టవర్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఈ ఘటనపై ఉద్యోగ సంఘం CGT స్పందన కోసం బీబీసీ సంప్రదించింది.

ఇదిలా ఉండగా,BAPS సంస్థ పారిస్ శివార్లలో ఆదివారం ఫ్రాన్స్‌లో తన తొలి ప్రధాన ఆలయాన్ని ప్రతిష్ఠించింది.

ఐఫిల్ టవర్ పర్యటనను సాధారణ ప్రారంభ సమయానికి అనుగుణంగా, ఇతర సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహణ బృందంతో కలిసి ఏర్పాటు చేసినట్లు పారిస్‌లోని BAPS ఆలయం 'ఎక్స్‌'లో పేర్కొంది.

ఈ పరిణామం వల్ల ఎవరికైనా బాధ లేదా అసౌకర్యం కలిగితే క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ సంస్థకు ఆలయాలు

పరస్పర గౌరవం,సేవ వంటి సార్వత్రిక విలువలను తాము విశ్వసిస్తామని పేర్కొంది.

BAPS తన వెబ్‌సైట్‌లో హిందూ విలువల ద్వారా సమాజాన్ని మెరుగుపరచడానికి పనిచేసే ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థగా తనను తాను పేర్కొంటుంది.

లండన్, లాస్ ఏంజెల్స్, సిడ్నీ సహా ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ సంస్థకు ఆలయాలు ఉన్నాయి.

ఈ ఘటనపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఐఫిల్ టవర్ ఉద్యోగులు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని తాను గమనించానని, వారి అసంతృప్తి సమర్థనీయమేనని 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

మహిళలు, పురుషుల సమానత్వం చారిత్రక కట్టడాల వద్ద మాత్రమే కాకుండా నగరంలోని ప్రతి చోట, ప్రతి ఒక్కరికీ వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ ఘటనను తప్పుబట్టిన యాయెల్ బ్రాన్-పివే

ఫ్రాన్స్ కుడిపక్ష నేత మెరైన్ లె పెన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఫ్రాన్స్‌లో మహిళల ఉనికిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితం చేయడాన్ని అంగీకరించబోమని అన్నారు.

వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన మాజీ మధ్యేవాద కుడిపక్ష ప్రధాని గాబ్రియేల్ అట్టాల్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లో మహిళలకు వారి స్థానం ఏమిటో ఏ సంస్కృతి, నమ్మకం, మతం లేదా వ్యక్తి నిర్ణయించలేరని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాయెల్ బ్రాన్-పివే కూడా ఈ ఘటనను తప్పుబట్టారు.

విదేశీ సందర్శకుల డిమాండ్లను నెరవేర్చేందుకు మహిళలను పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితిని తాను అంగీకరించబోనని పేర్కొన్నారు.

ADVERTISEMENT