Pakistan: పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో షేర్ షా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
వివరాలు
గురుద్వారా ప్రాంగణంలోనే దారుణం
పెషావర్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మర్దాన్ జిల్లా బాబు మొహల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్కడి గురుద్వారాలో సంరక్షకులుగా సేవలందిస్తున్న జగన్నాథ్ (70), ఆయన భార్య అస్మా వంతిని గుర్తుతెలియని దుండగులు బుధవారం కాల్పులు జరిపి హత్య చేశారు.
పవిత్ర గురుద్వారా ఆవరణలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
వివరాలు
జేఐటీతో దర్యాప్తు
ఈ హత్య కేసును ఛేదించేందుకు స్థానిక పోలీసులు, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) అధికారులతో కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ)ను ఏర్పాటు చేశారు.
మర్దాన్ జిల్లా పోలీస్ అధికారి (డీపీఓ) మసూద్ అహ్మద్ బంగాష్ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో నిందితుడికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేదా నిషేధిత నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని తెలిపారు.
హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, నిందితుడి వాంగ్మూలంతో పాటు సేకరిస్తున్న సాక్ష్యాధారాల ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
వివరాలు
భద్రతా లోపాలపై విమర్శలు
ఈ ఘటనతో గురుద్వారా భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాకిస్థానీ మీడియా కథనాల ప్రకారం, గురుద్వారా రక్షణ కోసం ఒక పోలీసు సిబ్బందిని నియమించినప్పటికీ, దాడి జరిగిన సమయంలో అతడు విధుల్లో లేకపోవడం వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా, ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) పనిచేయకపోవడం దర్యాప్తులో గుర్తించారు.
ఈ భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారత్ నుంచి తీవ్ర స్పందన
వృద్ధ సిక్కు దంపతుల హత్యపై భారత్‌లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
అకల్ తఖ్త్ జతేదార్ (ప్రధాన పూజారి) జియాని కుల్దీప్ సింగ్ గర్గజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు.
1950 నాటి నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ప్రకారం మైనారిటీల భద్రతను కల్పించడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.