Trump: ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కలకలం.. తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఖతార్ బహుమతిగా అందించిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానానికి అమర్చిన ఎమర్జెన్సీ స్లైడ్ అకస్మాత్తుగా తెరుచుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణం కొద్దిసేపు ఆలస్యమైంది. డలాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ మిడ్‌టర్మ్ సమావేశానికి హాజరయ్యేందుకు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి 'మెరైన్ వన్' హెలికాప్టర్‌లో జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ నుంచి దిగి ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు
15 నిమిషాల పాటు మెరైన్ వన్ హెలికాప్టర్‌లోనే..
ట్రంప్ విమానం ఎక్కేందుకు కొన్ని నిమిషాల ముందు.. ఎయిర్‌ఫోర్స్ వన్ ముందు భాగంలో ఉన్న అత్యవసర స్లైడ్ ఒక్కసారిగా తెరుచుకుంది.
దీంతో అధికారులు పరిస్థితిని పరిశీలించే వరకు ట్రంప్ సుమారు 15 నిమిషాల పాటు మెరైన్ వన్ హెలికాప్టర్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగినట్లు సమాచారం. అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనే ట్రంప్ డలాస్‌కు బయలుదేరారు.
అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం సురక్షితమేనా అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు.
దీనికి ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ.. విమానం సురక్షితం కాకపోతే తాను అందులో ఎక్కేవాడినే కాదని స్పష్టం చేశారు.
బోయింగ్ 747-8 విమానంలో సాధారణంగా మొత్తం 12 అత్యవసర స్లైడ్లు ఉంటాయి.