LOADING...
IRGC: శత్రువులు ఎలాంటి చిన్న తప్పు చేసినా ప్రాణాంతక పరిణామాలు.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక
అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

IRGC: శత్రువులు ఎలాంటి చిన్న తప్పు చేసినా ప్రాణాంతక పరిణామాలు.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్‌ సైనిక విభాగం తీవ్రంగా స్పందించింది. హర్మూజ్‌లోని ముఖ్య నౌకా మార్గం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఎలాంటి చిన్న తప్పు చేసినా ప్రాణాంతక పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళ విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు ఫలించకపోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మాట్లాడుతూ హర్మూజ్‌ జలసంధిని తెరుస్తామని ఇరాన్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వెంటనే జలసంధిని తెరవాలని హెచ్చరిస్తూ, అక్కడ జరుగుతున్న అక్రమ చర్యలను అడ్డుకుంటామని తెలిపారు.

వివరాలు 

రష్యా, ఇరాన్‌ అధ్యక్షుల సంభాషణ..

ఈ క్రమంలో జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు, త్వరలోనే చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. అమెరికాతో జరిగిన చర్చల వివరాలను ఇరాన్‌ అధ్యక్షుడు పుతిన్‌కు వివరించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ వెల్లడించినట్లు పేర్కొంది.

Advertisement