Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా, భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముయిజ్జూ ఆదేశాలు జారీ చేసి, మాల్దీవుల్లో UPIని ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని, ఆర్థిక, లావాదేవీల సామర్థ్యం పెరిగే అవకాశాలున్నాయని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. UPIని ప్రారంభించేందుకు ముయిజ్జూ ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రకటించారు. మాల్దీవుల బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలను ఈ కన్సార్టియంలో చేర్చాలని ఆయన సూచించారు.
జై శంకర్ మాల్దీవుల పర్యటనలో కీలక ఒప్పందాలు
ఈ ఏడాది ఆగస్టులో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులు పర్యటన సమయంలో UPIకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, మాల్దీవులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. UPIని మాల్దీవుల్లో ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకునే ముందు, దేశ జాతీయ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ (BML) భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. భారతదేశంలోని రూపే కార్డ్ ఇప్పుడు BML ATMలు, POS మెషీన్లలో అంగీకరిస్తున్నట్లు ఈ నెల 7న ప్రకటించింది.