LOADING...
Pakistan: పాకిస్తాన్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు..!
పాకిస్తాన్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు..!

Pakistan: పాకిస్తాన్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాతో పాకిస్థాన్ దేశం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇందుకు గల అవకాశాలను తాము మూసివేయలేదని పేర్కొన్నారు. అరబ్ దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగమవుతాయా అని జియోన్యూస్ విలేకరికి అడిగిన ప్రశ్నకు ఖవాజా ఆసిఫ్ స్పందించారు. "ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను. అయినప్పటికీ, ద్వారాలు మూసుకుపోలేదని చెప్పగలను," అని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌కు కొన్ని బలహీనతలు ఉన్నందున,నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, ముస్లిం దేశాలు ఉన్న ప్రాంతాల్లో, సమష్టిగా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

వివరాలు 

అణ్వాయుధాల వినియోగంపై ఎటువంటి పరిమితులు ఉండవు 

తాజాగా సౌదీ అరేబియాతో చేసిన ఒప్పందంలో, మూడో దేశం చేరకూడదు లేదా ఇలాంటి ఒప్పందం మరో దేశంతో జరగరాదు అనే ఎటువంటి నిబంధనలు లేవని ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ ఒప్పందంలో అణ్వాయుధాల వినియోగంపై ఎటువంటి పరిమితులు ఉండవని కూడా ఆయన చెప్పారు. "మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను ఉపయోగించుకుంటాము. అణ్వాయుధ తనిఖీలలో ఎల్లప్పుడూ సహకరిస్తాము, నిబంధనలు ఉల్లంఘించము," అని స్పష్టంగా తెలిపారు. అయినప్పటికీ, ఇది కేవలం రక్షణ ఒప్పందమే అని ఆయన గుర్తుచేశారు. అసలు విషయం ఏమిటంటే, చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తోందని,ఆ శిక్షణ కొనసాగింపుగా ఈ ఒప్పందాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసిఫ్ పేర్కొన్నారు.

వివరాలు 

అఫ్గానిస్థాన్‌ను ప్రత్యర్థి దేశంగా అభివర్ణించిన ఆసిఫ్

ఇరు దేశాలపై ఎవరైనా దాడి చేస్తే, వారు సమష్టిగా ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. అలాగే, అఫ్గానిస్థాన్‌పై అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన పరిణామాలను పాకిస్తాన్ అనుభవిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసిఫ్ అఫ్గానిస్థాన్‌ను ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. తాజాగా పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద ప్రకారం, ఇరు దేశాలపై ఎవరైనా దాడి చేస్తే, దానిని రెండింటిపై జరిగిన దాడిగా పరిగణించి సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వివరాలు 

రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ

ఇది ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం జరగటం ప్రత్యేకత కలిగినది.