Page Loader
Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం.. ప్రధాన నిందితుడి కాంటాక్ట్‌ లిస్ట్‌ జాబితా బహిర్గతం చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ 
అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం..

Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం.. ప్రధాన నిందితుడి కాంటాక్ట్‌ లిస్ట్‌ జాబితా బహిర్గతం చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం మళ్లీ ట్రంప్‌ ప్రభుత్వాన్ని తెరపైకి తెచ్చింది. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ పాల్పడిన ఈ ఘోరానికి సంబంధించి కీలక పత్రాలను అమెరికా న్యాయ శాఖ (Justice Department) తాజాగా విడుదల చేసింది. దీనికి 'ది ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌: ఫేజ్‌ 1' అనే పేరు పెట్టారు. ఇప్పటికే పలు దశలుగా ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బయటకొచ్చాయి. తాజాగా విడుదలైన ఫైల్స్‌లో కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. కాంటాక్ట్‌ లిస్ట్‌ జాబితా, ఫ్లైట్‌ లాగ్‌ సమాచారం, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

వివరాలు 

తాజా లిస్ట్‌లో ఉన్న ప్రముఖ వ్యక్తులు 

ఈ జాబితాలో ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ 'రోలింగ్‌ స్టోన్స్‌' సభ్యుడు మైక్‌ జాగర్‌,ప్రఖ్యాత పాప్‌ గాయకుడు మైఖేల్‌ జాక్సన్‌,నటుడు అలెక్‌ బాల్డ్‌విన్‌,అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి ఆర్‌ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ తల్లి ఎథెల్‌ కెన్నడీ,న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో,సుప్రీం మోడల్‌ నయోమి క్యాంప్‌బెల్‌ ఉన్నారు. అలాగే కెన్నడీ కుటుంబానికి చెందిన కెర్రీ,టెడ్‌,ట్రంప్‌ మాజీ భార్య ఇవానా ట్రంప్‌,కుమార్తె ఇవాంకా ట్రంప్‌ పేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే వీరంతా ఎప్‌స్టీన్‌ కస్టమర్లు కాదని,కేవలం కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల జాబితా మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌ ప్రయాణించిన ప్రైవేట్‌ జెట్‌ 'లోలితా ఎక్స్‌ప్రెస్‌' ఫ్లైట్‌ లాగ్‌ వివరాలను కూడా బహిరంగంగా విడుదల చేశారు.

వివరాలు 

ఎఫ్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం - అసలు విషయం ఏమిటి? 

అయితే ఈ ఫ్లైట్‌ లాగ్‌లోని చాలా పేర్లు ఇప్పటికే లీకైన వాటిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ నిర్వహించిన సెక్స్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారం అమెరికాను గజగజలాడించింది. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులను డబ్బు ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోలోని అతని నివాసాలకు పిలిపించి లైంగిక దాడులకు పాల్పడేవాడనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని తన వద్దకు తెస్తే అదనపు కమీషన్‌ ఇస్తానని ఎప్‌స్టీన్‌ ప్రలోభపెట్టేవాడని 2005లో జరిగిన దర్యాప్తులో బయటపడింది.

వివరాలు 

దాదాపు రెండు దశాబ్దాలుగా అక్రమ కార్యకలాపాలు 

ఈ అక్రమ కార్యకలాపాలు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగాయి. 2005లో మొదటగా ఈ వ్యవహారం బహిర్గతమైంది. అప్పుడు అతన్ని అరెస్టు చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. కానీ 2019లో 'మీ టూ' ఉద్యమం మళ్లీ ఎఫ్‌స్టీన్‌ గురించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో అతనిపై కొత్త కేసులు నమోదవ్వడంతో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అయితే, ఆగస్టు 2019లో జైలులో అనుమానాస్పద స్థితిలో అతను మృతిచెందాడు. అధికారికంగా దీనిని ఆత్మహత్యగా ప్రకటించినా, చాలా మంది ఇది హత్యే కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎఫ్‌స్టీన్‌ మాజీ ప్రియురాలు మాక్స్‌వెల్‌, ఈ అక్రమాలకు సహకరించిందని సాక్ష్యాధారాలతో రుజువుకావడంతో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.