Page Loader
Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్‌
నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్‌

Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్‌ ఎలాన్ మస్క్‌ మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరాయి. ఇప్పటికే ఈ ఇద్దరూ బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ స్పందించారు. గత కొన్ని నెలలుగా పాలన సంబంధిత అంశాల్లో ఎలాన్ మస్క్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకొచ్చిన ఓ బిల్లు నేపథ్యంలో మస్క్‌కు అసహనం పెరిగిందని, అందుకే ఆయన ట్రంప్‌పై ఘాటైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇదే కారణంగా ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ఇరువురు తమ తేడాలను పక్కన పెట్టి కలసి పనిచేయాలి: ఎరాల్

ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారని ఎరాల్ తెలిపారు. కానీ కాంగ్రెస్, సెనెట్‌లలో మెజారిటీ ఓట్లను పొందేందుకు అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ట్రంప్‌కు ఉండవచ్చని,దీన్ని మస్క్ అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. ట్రంప్ దేశాధినేతగా ఉన్నందున ఈ వివాదంలో విజయం ఆయనవైపే ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇరువురు తమ తేడాలను పక్కన పెట్టి కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. గత మేలో అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ట్రంప్‌కి ఆయనకి మధ్య దూరం పెరిగింది.

వివరాలు 

మస్క్ అసంతృప్తికి డోజ్ నుంచి తొలగించడమే కారణం: ట్రంప్ 

ఈ నేపథ్యంలో మస్క్ చేసిన, "ట్రంప్ అధ్యక్ష పదవిలోకి రావడానికి నేను ముఖ్య కారణం" అన్న వ్యాఖ్యలపై ట్రంప్ సూటిగా స్పందించారు. ఎవరి సహాయం లేకుండానే తాను గెలిచానని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ సామర్థ్య విభాగమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) నుంచి తనను తొలగించడమే మస్క్ అసంతృప్తికి కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

మస్క్ గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు: ట్రంప్ 

అదే సమయంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెఫ్రీ ఎప్‌స్టైన్ వ్యవహారంలో ట్రంప్‌కు కూడా సంబంధం ఉందని, అందుకే ఆ కేసు నిధులు, సమాచారం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మీడియా ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన "తాను బిజీగా ఉన్నాను" అంటూ విషయాన్ని తప్పించుకున్నారు. అంతేకాదు, "ఎలాన్ మస్క్ గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు" అని కూడా వ్యాఖ్యానించారు.