Everest: ఎవరెస్ట్‌పై రూ.186 కోట్ల మోసం.. సీక్రెట్‌గా ఆహారంలో విషం కలిపి కుట్ర!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందిన మౌంట్ ఎవరెస్ట్‌కు సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడికి వెళ్లే పర్వతారోహకులు ట్రెక్కింగ్ సమయంలో తీసుకునే ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు బయటపడ్డాయి. కొందరు వ్యక్తులు ఒక గుంపుగా ఏర్పడి ఈ కుట్రను అమలు చేస్తున్నట్లు తేలింది. అత్యవసర పరిస్థితులను సృష్టించి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని నేపాల్ పోలీసులు వెల్లడించారు.
వివరాలు
బయటపడిన భారీ స్కామ్..
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ఎవరెస్ట్‌కు వెళ్లే ట్రెక్కర్ల ఆహారంలో బేకింగ్ సోడా మోతాదును అధికంగా కలిపుతున్నారు.
దీంతో వారు జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలు ఎత్తు ప్రభావం వల్లే వచ్చాయని వారికి నమ్మిస్తున్నారు.
ఈ సమయంలో వారి భయాన్ని ఉపయోగించుకుని మోసగాళ్లు తమ ప్రణాళికను అమలు చేస్తారు.
బాధితులను అత్యవసర చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తారు.
ఆ సమయంలో ఎంత ఖర్చైనా చెల్లించేందుకు వారిని ఒప్పిస్తారు.
ఈ పథకంలో కొందరు షెర్పాలు, ట్రెక్కింగ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది.
తరువాత నకిలీ వైద్య నివేదికలు, ఫ్లైట్ పత్రాలను చూపించి బీమా సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
వివరాలు
32 మంది అరెస్ట్..
అందిన సమాచారం ప్రకారం, ఈ బీమా మొత్తాన్ని షెర్పాలు, హెలికాప్టర్ సంస్థలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, నకిలీ పత్రాలు అందించిన ఆసుపత్రులు పరస్పరం పంచుకుంటున్నాయి.
ఈ మోసం మొత్తం విలువ సుమారు 20 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.186 కోట్లు అని అంచనా.
పర్వత ప్రాంతాల్లో రక్షణ చర్యలు నిర్వహించే సంస్థలకు చెందిన ఆరుగురు అధికారులు ఈ ఏడాది జనవరిలో అరెస్టు అయ్యారు.
దీంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.
ఇప్పటి వరకు 32 మందిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
ప్రభుత్వ చర్యలు ఎక్కడ?
నేపాల్ పర్యాటక రంగంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఎవరెస్ట్ ట్రెక్కింగ్‌కు సంబంధించిన ఈ మోసాన్ని అక్కడి కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది.
ఈ నెట్‌వర్క్‌లో పాల్గొన్న వారికి భారీ జరిమానాలు విధించాలని డిమాండ్లు వస్తున్నాయి.
అయితే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగే మోసాలు ఇది మొదటిసారి కాదు.
ఈ తరహా ఘటనల కారణంగా కొన్ని అంతర్జాతీయ బీమా సంస్థలు ఎవరెస్ట్‌కు వెళ్లే పర్యాటకులకు ఇన్సూరెన్స్ అందించడం నిలిపివేశాయి.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కఠినమైన శిక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.