Loading...
Meta: చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ 'అడగొద్దు.. చెప్పొద్దు' విధానం
చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ 'అడగొద్దు.. చెప్పొద్దు' విధానం

Meta: చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ 'అడగొద్దు.. చెప్పొద్దు' విధానం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

మెటా ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్‌ 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో అనుసరించిన విధానంపై ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ ఆర్టరో బెజెర్‌ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. చిన్నారుల వయసును తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. వారు తమ వయసు గురించి చెప్పకపోతే పట్టించుకోని విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అనుసరించిందని ఆయన వెల్లడించారు. మెటాపై జరుగుతున్న విచారణలో రెండో రోజు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త టూల్స్‌,ఫీచర్లు రూపొందించే సమయంలో యూజర్ల భద్రత కంటే లాభాలపైనే మెటా ఎక్కువగా దృష్టి పెట్టిందని బెజెర్‌ కోర్టుకు తెలిపారు. ప్రజలు తమ యాప్‌లలో ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నారనే అంశానికే సంస్థ ప్రాధాన్యం ఇచ్చేదని చెప్పారు.

వివరాలు 

13 ఏళ్లలోపు పిల్లలు భారీ సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగిస్తున్నారు: బెజెర్

ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగిస్తున్న విషయం తెలిసినా.. వారి వయసును నిర్ధారించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

తమ పరిశోధనలో 13 ఏళ్లలోపు పిల్లలు భారీ సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు బెజెర్‌ పేర్కొన్నారు.

నకిలీ ఖాతాలను గుర్తించేందుకు మెటా వద్ద సమర్థమైన టూల్స్‌ ఉన్నప్పటికీ.. పిల్లల వయసును గుర్తించడానికి అవసరమైన ప్రమాణాలను మాత్రం సరిగ్గా రూపొందించలేదని చెప్పారు.

అయితే మాజీ అధికారి చేసిన ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండించింది.

ఉద్యోగుల పనితీరు అంచనాల్లోనూ యూజర్‌ సంఖ్యలు కీలకంగా ఉండేవని బెజెర్‌ తెలిపారు.

జీతాల పెంపు, ప్రమోషన్ల సమయంలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు యూజర్లు యాప్‌లపై వెచ్చించే సమయంతో పాటు ఇతర నంబర్లను పరిగణనలోకి తీసుకునేవారని వెల్లడించారు.

వివరాలు 

మెటా యాప్స్‌ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంట్రాక్టర్

బెజెర్‌ 2009 నుంచి 2015 వరకు ఫేస్‌బుక్‌లో పనిచేశారు. ఆ సమయంలో సైబర్‌ వేధింపులను ఎదుర్కొనే చర్యలపై ఆయన చేసిన పని కారణంగా గుర్తింపు పొందారు.

అనంతరం 2019 నుంచి 2021 వరకు మెటా యాప్స్‌ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంట్రాక్టర్‌గా పనిచేశారు.

2023లో అమెరికా కాంగ్రెస్‌ నిర్వహించిన విచారణలోనూ మెటాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

సంస్థకు చెందిన యాప్స్‌ వినియోగం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయం సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తెలుసని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మెటాపై ఓక్‌లాండ్‌ ఫెడరల్‌ కోర్టులో దావా

ఇదిలా ఉండగా.. అమెరికాలోని 29 రాష్ట్రాలు కలిసి మెటాపై ఓక్‌లాండ్‌ ఫెడరల్‌ కోర్టులో దావా వేశాయి.

పిల్లలు, టీనేజర్లను తమ సోషల్‌ మీడియా యాప్‌లకు ఎక్కువగా ఆకర్షించేలా మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్‌ చేసిందనేది ప్రధాన ఆరోపణ. యూజర్లు వీలైనంత ఎక్కువ సమయం యాప్‌లలోనే గడిపేలా చేయడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, సంస్థకు సంబంధించిన కొన్ని వాస్తవాలను బయటకు రానివ్వకుండా చేయడం మెటా వ్యాపార విధానంలో భాగమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ మేగన్‌ ఓనెయిల్‌ విచారణ ప్రారంభమైన సందర్భంగా ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

మెటా ఓడిపోతే రూ.19 లక్షల కోట్ల పరిహారం

యువతను సోషల్‌ మీడియాకు బానిసలుగా మార్చగలిగితే.. వారు దీర్ఘకాలం పాటు యాప్‌లను ఉపయోగిస్తారని, తద్వారా మెటాకు భారీ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని ఆమె వాదించారు.

ఈ కేసులో మెటా ఓడిపోతే కనీసం రూ.19 లక్షల కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ADVERTISEMENT