Eye transplant : వైద్యశాస్త్రంలోనే అరుదైన ఆపరేషన్.. మొదటిసారిగా నేత్ర మార్పిడి
ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం మరో అరుదైన ఘనత వహించింది. ఈ మేరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో నేత్ర మార్పిడి శస్త్ర చికిత్సను అమెరికా వైద్యులు నిర్వహించారు. నూయార్క్‌లోని వైద్య నిపుణుల బృందం ఓ వ్యక్తికి మొత్తం కంటినే మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. అయితే ఆపరేషన్ అనంతరం బాధితుడికి చూపు కచ్చితంగా వస్తుందని స్పష్టంగా చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. శస్త్రచికిత్సలో భాగంగా దాత ముఖం భాగాన్ని, మొత్తం ఎడమ కన్నును తొలగించి వాటిని రోగికి అతికించారు. 46 ఏళ్ల లైన్ వర్కర్ ఆరోన్ జేమ్స్ 2021 జూన్ 17న విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆ ప్రమాదంలో అతని ముఖం, లైవ్ కరెంట్ వైర్‌ను తాకగా ఎడమ కన్ను దెబ్బతింది.
తొలిసారిగా తాము పూర్తి నేత్ర మార్పిడిని ముఖంతో పూర్తి చేశాం : డా.ఎడ్వర్డో రోడ్రిగ్జ్
ఎడమ కన్ను,మోచేయిపైన ముక్కు,పెదవులు, ముందు పళ్లు, ఎడమ చెంప, గడ్డం ఎముక సహా ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే వైద్య చికిత్సల నిమిత్తం బాధితుడిని ప్రముఖ ఆస్పత్రి లాంగోన్ హెల్త్‌కి తరలించారు. అయితే మే 27న అతడికి శస్త్ర చికిత్స చేసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. త్రీడి కట్టింగ్ మార్గదర్శకాలను ఉపయోగించి తొలిసారిగా తాము పూర్తి నేత్ర మార్పిడిని ముఖంతో పూర్తి చేశామని శస్త్రచికిత్స బృందంలోని చీఫ్ డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్జ్ అన్నారు. ఆపరేషన్ నిర్వహణకు మొత్తం 21 గంటల పట్టిందని, మార్పిడి చేసిన ఎడమ కన్ను రెటీనాకు ప్రత్యక్ష రక్త ప్రసరణతో పాటు కాంతిని స్వీకరించడం,మెదడుకు చిత్రాలను పంపే అంశంతో పాటు ఆరోగ్య పరంగా సానుకూల సంకేతాలను చూపించిందన్నారు.
చూపు వచ్చే అవకాశం ఉంది, కానీ అసాధ్యం అని చెప్పను : కియా వాషింగ్టన్
మరోవైపు తాము చేసింది చాలా పెద్ద ప్రయోగమని, 15 ఏళ్లు అనుభవమున్న కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ యూనివర్సిటీ శస్త్రచికిత్స ప్రొఫెసర్ కియా వాషింగ్టన్ అన్నారు. చాలా క్లిష్ట సమయంలో నాకు రెండో అవకాశం కల్పించారని, ఈ మేరకు దాతతో పాటు అతని కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రోగి జేమ్స్ తెలిపారు. దాతలో కొంత భాగం నాతోపాటే జీవిస్తున్నారని, ఫలితంగా దాత కుటుంబం కొంత ఓదార్పును పొందగలుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటికి చేరుకున్న జేమ్స్, చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత గడిచిన సమయం మేరకు జేమ్స్ చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని కియా వాషింగ్టన్ అన్నారు. కానీ ఇది అసాధ్యమని తానెప్పుడూ చెప్పనన్నారు.