LOADING...
Asim Munir:'నువ్వు మగవాడివైతే మమ్మల్ని ఎదుర్కో'.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌కు పాకిస్తానీ తాలిబన్ల బహిరంగ బెదిరింపు
పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌కు పాకిస్తానీ తాలిబన్ల బహిరంగ బెదిరింపు

Asim Munir:'నువ్వు మగవాడివైతే మమ్మల్ని ఎదుర్కో'.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌కు పాకిస్తానీ తాలిబన్ల బహిరంగ బెదిరింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాదుల బెదిరింపులు,మరోవైపు అఫ్గానిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. తాజాగా టీటీపీ పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ (Asim Munir)ను హెచ్చరించింది తమను ఎదుర్కొనే ధైర్యం ఉంటే ముందుకు రావాలని సవాలు విసురుతూ వీడియోలను విడుదల చేసింది. సైనికులను పంపడం మానేసి, ఉన్నతాధికారులే యుద్ధభూమికి రావాలని వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, అక్టోబర్‌ 8న ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన దాడి దృశ్యాలను కూడా ప్రచారం చేసింది.

వివరాలు 

కాజిమ్‌ తలపై 10 కోట్లు పాకిస్థానీ రూపాయల బహుమతి

వీడియోల్లో కనిపించిన కమాండర్‌ కాజిమ్‌ అని పాక్‌ అధికారులు గుర్తించారు. ఆ వీడియోలో మునీర్‌ను ఉద్దేశించి "నువ్వు మగవాడివైతే మమ్మల్ని ఎదుర్కో" అంటూ కాజిమ్‌ హెచ్చరించినట్లు వెల్లడించారు. ఈ సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న పాక్‌ ప్రభుత్వం, కాజిమ్‌ తలపై 10 కోట్లు పాకిస్థానీ రూపాయల బహుమతిని ప్రకటించింది. అతడి సమాచారం అందించే వారికి ఆ మొత్తం అందజేస్తామని కూడా స్పష్టం చేసింది. తమ భూభాగాన్ని ఉపయోగించుకుంటూ టీటీపీ ఉగ్రవాదులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ, అఫ్గానిస్థాన్‌ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ అధికార వర్గాలు డిమాండ్‌ చేశాయి. అయితే ఉగ్రవాదులకు తాము ఆశ్రయం ఇస్తున్నామనే ఆరోపణలను అఫ్గాన్‌ ఖండించింది. ఈ అంశమే ఇరుదేశాల మధ్య ఘర్షణలను మరింతగా పెంచింది.

వివరాలు 

తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించిన  ఇరుదేశాలు 

ఇటీవల ఉగ్రవాదులపై దాడుల పేరుతో పాక్‌ సైన్యం చేసిన దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్‌ కూడా ప్రతిస్పందించింది. రెండు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు కొనసాగిన ఈ ఘర్షణలకు ఖతార్‌ రాజధాని దోహాలో ముగింపు లభించింది. రెండు విడతల చర్చల అనంతరం శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఖతార్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది.