Loading...
Fake weddings for Green Cards: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజీలు.. అమెరికాలో 11 మందిపై కేసు
గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజీలు.. అమెరికాలో 11 మందిపై కేసు

Fake weddings for Green Cards: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజీలు.. అమెరికాలో 11 మందిపై కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో గ్రీన్ కార్డులు ఇప్పించేందుకు నకిలీ పెళ్లిళ్లు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సాగిన ఈ వ్యవహారంలో 1,000కిపైగా నకిలీ పెళ్లిళ్లు జరిగినట్లు అమెరికా న్యాయశాఖ (DOJ) వెల్లడించింది. దాదాపు పదేళ్లపాటు కొనసాగిన ఈ మోసం ద్వారా కోట్లాది డాలర్లు ఆర్జించినట్లు అధికారులు ఆరోపించారు. ప్రధానంగా చైనా పౌరులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ వ్యవహారం సాగినట్లు తెలిపారు. గ్రీన్ కార్డు పొందడంతో పాటు చివరికి అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 1 లక్ష డాలర్ల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికాలోనే కాదు.. విదేశాల్లోనూ నకిలీ పెళ్లిళ్లు

అమెరికాలోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన అభియోగపత్రం తాజాగా బహిర్గతమైంది.

దాని ప్రకారం ఈ నెట్‌వర్క్ కనీసం 2016 నుంచి 2026 జులై వరకు పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిర్వాహకులు విదేశీయులను అమెరికా పౌరులతో జత చేసి, వారితో నకిలీ వివాహాలు చేయించేవారని అధికారులు తెలిపారు.

ఇందుకోసం అమెరికా పౌరులకు 30 వేల డాలర్ల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చేవారు.

ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దశలు పూర్తయ్యే కొద్దీ విడతల వారీగా డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో అమెరికా పౌరులను తీసుకొచ్చిన రిక్రూటర్లకు ఒక్కో వ్యక్తికి 5 వేల డాలర్ల వరకు కమీషన్ ఇచ్చినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రీన్ కార్డు కోసం ఏకంగా 1,000 నకిలీ పెళ్లిళ్లు.. 11 మందిపై కేసు

ADVERTISEMENT

వివరాలు 

అమెరికాలోనే కాదు.. విదేశాల్లోనూ నకిలీ పెళ్లిళ్లు

కొన్ని సందర్భాల్లో పెళ్లి లైసెన్స్ తీసుకునే కొద్దిసేపటి ముందు మాత్రమే ఆ జంటలు మొదటిసారి కలుసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అనంతరం అమెరికాలోని కనెక్టికట్, మసాచుసెట్స్, జార్జియా, ఫ్లోరిడాతో పాటు వనాటు, చైనా వంటి విదేశీ ప్రాంతాల్లోనూ పెళ్లి వేడుకలు నిర్వహించినట్లు ఆరోపించారు.

ఈ వివాహాలు నిజమైనవేనని నమ్మించేందుకు ఫొటోలు కూడా తీయించేవారని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసం చేసేందుకు నకిలీ పత్రాలు

నకిలీ పెళ్లిళ్లు చేయించడంతో ఈ వ్యవహారం ఆగిపోలేదని అధికారులు తెలిపారు.

జంటల మధ్య నిజమైన సంబంధం ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారులను నమ్మించేందుకు తప్పుడు ఆధారాలను కూడా సిద్ధం చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఇందులో ఉమ్మడి బ్యాంకు ఖాతాలు, విద్యుత్ లేదా ఇతర యుటిలిటీ బిల్లులు,బీమా పాలసీలు, నకిలీ ఉమ్మడి పన్ను రిటర్నులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా నకిలీ వెడ్డింగ్ ఆల్బమ్‌లు, ఇతర పత్రాలను కూడా సిద్ధం చేసి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులకు జత చేసేవారని పేర్కొన్నారు.

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (USCIS) అధికారుల ఇంటర్వ్యూలకు ముందు జంటలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారని అధికారులు తెలిపారు.

ఒకరితో ఒకరు సరిపోలేలా, కానీ వాస్తవానికి కల్పించిన సమాధానాలు చెప్పాలని వారికి సూచించేవారని ఆరోపించారు.

వివరాలు 

11 మందిలో 10 మంది అరెస్టు

ఇలా అధికారులను నమ్మించి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసులో 11 మంది నిందితుల్లో 10 మందిని బుధవారం ఉదయం ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు.

అనంతరం వారిని వైట్ ప్లెయిన్స్‌లోని ఫెడరల్ కోర్టులో అమెరికా మేజిస్ట్రేట్ జడ్జి జుడిత్ సి. మెకార్తీ ఎదుట హాజరుపరిచారు.

దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో సాగిన ఈ వ్యవహారం కోట్లాది డాలర్ల విలువైనదని యూఎస్ అటార్నీ జేమీ మెక్‌డొనాల్డ్ తెలిపారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను లాభాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ కూడా అక్రమ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల్లో పాల్గొన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

వివరాలు 

ఐదేళ్ల వరకు జైలు శిక్ష

అమెరికా చరిత్రలో నమోదైన అతిపెద్ద మ్యారేజ్ ఫ్రాడ్ కేసుల్లో ఒకదానికి సంబంధించిన కీలక నెట్‌వర్క్‌ను ఈ అరెస్టులతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో అమీ చెంగ్, జియావో మెయి చాన్, క్రిస్టీన్ లూ, జింగ్ యాన్ యే, జియావో యాన్ చెన్, గ్యాంగ్ జెంగ్,ఆంథోనీ చెంగ్,మిషెల్ డ్యూనాస్,ఏంజెలా డ్యూనాస్, సిగ్రిడ్ సెటినో, ఎరికా జాన్సన్ ఉన్నారు.

వీరందరిపై మ్యారేజ్ ఫ్రాడ్, ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్‌కు కుట్ర చేసినట్లు ఒక్కో అభియోగం నమోదైంది.

నేరం రుజువైతే ఒక్కో అభియోగానికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు ఫెడరల్ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణలు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు నిందితులందరినీ నిర్దోషులుగానే పరిగణిస్తారు.

ADVERTISEMENT